యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కమ్యునిస్టులు, కాంగ్రెస్ కంటే కమలం చాలా ప్రమాదరకమైనదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ గుర్తించినట్లుంది. అందుకే ఆమె టార్గెట్ మొత్తం మోదీపైనే ఉంచి ప్రచారం చేస్తున్నారు. మరోసారి మోదీ ప్రధాని కాకూడదన్నది మమత ఆకాంక్ష. ఎప్పటికైనా పశ్చిమ బెంగాల్ లో తనకు పోటీ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని గుర్తించిన మమత బెనర్జీ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపించి కమలాన్ని రాష్ట్రం నుంచి తరిమేయాలని భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అంటేనే తొలుత కమ్యునిస్టులకు కంచుకోట. కాంగ్రెస్ పార్టీ గతంలో బలంగా ఉన్నప్పటికీ కమ్యునిస్టుల దెబ్బకు కాంగ్రెస్ కుదేలైపోయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ పార్టీ పెట్టుకున్న మమత బెనర్జీ కమ్యునిస్టుల కంచుకోటను కూలగొట్టడానికి కొంత సమయం పట్టింది. చివరకు విజయం సాధించారు. ఇదే తరహాలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ వేళ్లూనుకుంటోంది. మొక్కగా ఉండగానే తుంచేయాలని మమత ఆరాటపడుతున్నారు.ఈ లోక్ సభ ఎన్నికల వేళ ముందుగానే మమత బెనర్జీ కోల్ కత్తాలో విపక్షాలతో కలసి భారీ సభను నిర్వహించి తమ జోలికి రావద్దని గట్టిగానే హెచ్చరికలు పంపారు. కానీ అమిత్ షా, నరేంద్ర మోదీలు మాత్రం పశ్చిమ బెంగాల్లో కనీసం ఇరవై స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. మోదీ, అమిత్ షాలు పశ్చిమబెంగాల్ లో విస్తృతంగా పర్యటిస్తూ మమతపై వ్యక్తిగత ఆరోపణలకు సయితం దిగుతున్నారు. మైండ్ గేమ్ ను సయితం మొదలుపెట్టారు. తనకు మమత బెంగాలీ స్వీట్లు తరచూ పంపుతారని, తమతో 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సాక్షాత్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మైండ్ గేమ్ లో భాగమేనంటున్నారు.అంతేకాదు ఫోని తుఫాను బీభత్సంపై మోదీ స్వయంగా మమతకు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. ప్రధాని మోదీ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోకపోవడంపై మమత దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. అయినా మమత డోన్ట్ కేర్ అంటున్నారు. మోదీని గద్దెనెక్కకుండా చేయడమే తన లక్ష్యమని, తుపాను వంటి సహాయ కార్యక్రమాల పేరుతో మరో మైండ్ గేమ్ కు మోదీ తెరతీశారని తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద మోదీకి మమత మింగుడుపడటం లేదు. మమత మోదీని కేర్ చేయడం లేదు. భవిష్యత్తులో ఇలాంటి సంబంధాలే కొనసాగితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే అవకాశముందన్న ఆందోళన కూడా లేకపోలేదు.