యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విశాఖ జిల్లాలో వైసీపీ సొంతంగా సమీక్షలకు సిధ్ధపడింది. పార్టీ అధినాయకత్వం ఎటూ సమీక్షలు చేపట్టకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు ఎవరి మటుకు వారు సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. తద్వారా తమ గెలుపు అవకాశాలు ఎంతమేరకు ఉంటాయో వాకబు చేసుకుంటున్నారు. గాజువాక, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్ధులు ఈ విధంగా నిర్వహించిన సమావేశాలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను బూత్ స్థాయి నుంచి ఆహ్వానించి వారితో మాట్లాడించడం ద్వారా తమ విజయావకాశాలను బేరీజు వేసుకున్నారు. గాజువాకలో గెలుపు వైసీపీకి ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలు ముక్త కంఠంలో చెబుతున్నా ఎందుకో నాయకులల్లో ధైర్యం ఛిక్కడంలేదు.యువతలో మంచి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి తొలిసారిగా పోటీ చేయడంతో ఎంత కాదనుకున్నా అటువైపే విజయం ఉండొచ్చన్న బెంగ వైసీపీలో ఉంది. తాము చాలా మటుకు కట్టడి చేసి పరిస్థితిని సానుకూలం చేసుకున్నామని బయటకు చెబుతున్నా గెలుపు సాధిస్తామా అన్న ఆందోళన అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డిలో ఉంది. అయితే ఆత్మీయ సమావేశాలకు హాజరైన వారంతా పవన్ వంటి సెలిబ్రిటీపై నాగిరెడ్డి ఘన విజయం సాధించబోతున్నారని చెప్పుకొచ్చారు. ఇది చారిత్రాత్మకమైన విజయం అవుతుందని కూడా అభివర్ణించారు. ఏపీలో జగన్ సీఎం కావడం, గాజువాకలో నాగిరెడ్డి గెలుపు సాధించడం సరి కొత్త చరిత్రగా నేతలు, కార్యకర్తలు ధీమాగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం గాజువాకలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో ఆ పార్టీ నాయకులు అన్ని లెక్కలు చూసుకుని మరీ ఎంత తక్కువైనా పవన్ 30 వేల మెజారిటీకి తక్కువ కాకుండా గెలుస్తారని చెప్పుకొచ్చారు. దాంతో బేజారెత్తిన వైసీపీ నాయకులు వెంటనే తాము కూడా ఆత్మీయ సమావేశం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన్ పార్టీ పరిస్థితి గురించి ఆరా తీశారు. .కాగా 2009 నుండి ఇప్పటికి మూడు విడతలుగా పోటీ పడి అప్పట్లో ప్రజారాజ్యం, 2014లో టీడీపీ, ఇపుడు పవన్ గాలిని తట్టుకుని నాగిరెడ్డి ముందుకు సాగారని, ఆయన కనుక గెలిస్తే మత్రి పదవి ఇవ్వాల్సిందేనని కార్యకర్తలు అంటున్నారు. పవన్ లాంటి సెలిబ్రిటీని ఓడించడం అంటే ఆషామాషీ కాదని, అందువల్ల అధినాయకత్వం నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఇప్పటి నుంచే అభిమానులు గట్టిగా చేస్తున్నారు. భీమవరంలో పవన్ని ఓడిస్తే మంత్రిని చేస్తామని అక్కడి వైసీపీ అభ్యర్ధికి హామీ ఇచ్చారని, ఇదే విధంగా గాజువాకలో గెలిస్తే తమకూ తగిన గౌరవం ఇవ్వాలని నాగిరెడ్డి అనుచరులు అపుడే కొత్త డిమాండ్ పెడుతున్నారు. ఏది ఏమైనా అత్మీయ సమావేశాలతో అభ్యర్ధులు తమ గెలుపుపై కొంత బెంగను దించుకుంటున్నారనే చెప్పాలి.