యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
ఒక వైష్ణవ జీయర్ స్వామివారు కొత్తగా సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. పూర్వాశ్రమం నుండే పరమాచార్య స్వామి అంటే అభిమానం ఉండడం వల్ల, ఇప్పుడు వారిని కలవాలని ఆశించారు. వారి కోరికను పరమాచార్య స్వామివారికి తెలుపగానే, మఠం వ్యాను పంపారు. జీయర్ స్వామివారు, నేను మరియు కొందరు సహాయకులు వెళ్ళాము.
జీయర్ స్వామివారు రాగానే, మహాస్వామివారు సంతోషం నిండిన మోముతో, “స్వాగతం, శ్రీ రామానుజ” అని పలికారు. వెంటనే, “కాదు, కాదు! శ్రీ ఇరామానుజరే!” అని అన్నారు. (మేము ప్రబంధ సేవ చేసేటప్పుడు ‘ఇరామానుజ నూత్రందాది’ అని పిలుస్తాము. పరమాచార్య స్వామివారు దాన్ని గుర్తు పెట్టుకుని అలా పిలిచారు).
ప్రబంధ సేవ ముగియగానే, స్వామివారు జీయర్ స్వామిని ఆశీర్వదిస్తూ, “మరొక్క నూరేళ్ళు జీవించండి” అని ఆశీర్వదించి, పచ్చని జరీ శాలువా, పళ్ళతో సత్కరించారు. అప్పుడు మహాస్వామివారు ఎవరికీ తెలియని ఒక విషయం చెప్పారు. శ్రీపెరుంబదూర్ దేవాలయంలో ఉన్న పల్లకి పూర్వ కంచి పీఠాధిపతులు ఇచ్చిన బహుమానం.
కంచి వరదరాజ స్వామి దేవాలయ రాజగోపుర కలశం క్రిందపడి విరిగిపోయింది. పరమాచార్య స్వామివారి చొరవతో రాజగోపుర జీర్ణోద్ధరణ మొదలుపెట్టబడి పనులు కూడా జరుగుతున్నాయి. అప్పుడు మహాస్వామివారు తేనంబాక్కంలో మకాం చేస్తున్నారు. కంచి దేవరాజ పెరుమాళ్ దేవాలయం సన్నిధి మాడ వీధులు ప్రదక్షిణం చెయ్యడం స్వామివారు నియమంగా పెట్టుకున్నారు. స్వామివారు నడిచే వేగాన్ని ఎవరూ అందుకోలేరు.
ఉత్తర మాడ వీధిలో ఉన్న మా ఇంటి ముందు కొద్ది నిముషాల పాటు నిలబడి ధ్యానం చేశారు మహాస్వామివారు. ఇంటి లోపలి వైపుకు చూశారు. ఈ కారుణ్య దృష్టి ఎందుకో అప్పుడు మాకు అర్థం కాలేదు. రోజూ వేగంతో వెళ్ళిపోయే మహాస్వామివారు ఆ రోజు (23-12-1977) ఎందుకు అలా నిలబడ్డారో తెలియదు.
వేగంగా నడవడం వల్ల కలిగిన అలసట తీర్చుకోవడానికా? కాదు. డానికి కారణం ఏమిటో ఆరోజు రాత్రి తెలిసింది. అవును ఆ రాత్రే మా నాన్నగారు వైకుంఠ ప్రాప్తి పొందారు.
మా నాన్నగారికి దృష్టి లేదు. ఆయన ఎప్పుడూ విష్ణు సహస్ర్రం పారాయణ చేసేవారు. యానైకట్టి వీధిలో ఉన్న శంకర మఠంలో సాయంత్రాలు జరిగే గోపూజ, గజపూజలకు హాజరయ్యేవారు. అక్కడే సహస్రనామం పారాయణ చేసేవారు.
కంచి దేవరాజ పెరుమాళ్ పై పరమాచార్య స్వామివారికి ఉన్నతమైన భక్తీ.
గరుడసేవ రోజు మహాస్వామి వారు కాంచీపురంలో ఉన్నట్లయితే, శ్రీవారు ఎదో ఒక చోటు (సన్నిధిలో, గోపుర ప్రవేశం వద్ద, పదహారు కాళ్ళ మండపం ప్రవేశం వద్ద, కచ్చపేశ్వర దేవాలయం వద్ద లేదా మఠం ఎదురుగా ఉన్న గంగైకొండన్ మండపం వద్ద) నుండి స్వామివారికి సేవ చేసుకోవడం పరిపాటి.
సాయంత్రం తిరుగు ఉత్సవంలో, మఠాధిపతిగా బహుమాన పంచామృత శఠారి గౌరవం ఇస్తారు పరమాచార్య స్వామివారికి.
అలాగే, వైకుంఠ ఏకాదశి రోజున పరమాచార్య స్వామివారు కాంచీపురంలో ఉన్నట్లయితే, సాయంత్రంలోపు ఎదో ఒక సమయంలో దేవాలయానికి వచ్చి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా పెరుమాళ్ సేవ చేసుకుని తమ చోటుకు వెళతారు. వైకుంఠ ఏకాదశి రోజున కాంచీపురంలో ఉన్న ఎనిమిది దివ్యదేశాలకు పాదయాత్రగా వెళ్లి అష్ట విష్ణు దర్శనం చేసుకోవడం కూడా నేను చూశాను.
--- టి. ఎ. భాష్యం, ఉత్తర మాడ వీధి, చిన్న కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 6
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।