YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముంబైలో పట్టు కోసం పోరాటం

ముంబైలో పట్టు  కోసం పోరాటం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ముంబయి… దేశ ఆర్థిక వాణిజ్య రాజధాని. పశ్చిమానగల మహారాష్ట్ర రాజధాని అయినప్పటికీ దేశ వాణిజ్య రాజధానిగా కూడా సుపరిచతం. రిజర్వ్ బ్యాంకు తో సహా అనే ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల కేంద్ర కార్యాలయాలు ఈ మహానగరంలోనే కొలువు దీరి ఉన్నాయి. దేశంలోని ప్రముఖ నగరాల్లో అత్యంత కీలకమైనది. న్యూఢిల్లీ… రాజకీయ రాజధాని అయినప్పటికీ సంపన్నులు నివసించే ముంబయి మహానగరంపైనే అందరి దృష్టీ ఉంటుంది. పాకిస్థాన్ కు ఇస్లామాబాద్ రాజధాని అయినప్పటికీ ఓడరేవు నగరం కరాచీ పాక్ ఆర్థిక రాజధానిగా పేరు గాంచింది. కరాచీ మాదిరిగానే ముంబయి మహానగరం కూడా అరేబియా మహాసముద్ర తీరాన విస్తరించి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నట్లు ముంబయిలో కూడా ఎన్నికల హడావిడి విస్తరించి ఉంది.ముంబయి మహానగరంలో ఏడు లోక్ సభ స్థానాలుఉన్నాయి. వీటిల్లో అత్యంత కీలకమైనది ముంబయి దక్షిణ నియోజకవర్గం. గత నెల 29వ తేదీన జరిగిన పోరులో శివసేన, కాంగ్రెస్ అభ్యర్థులుగా అర్వింద్ గణపత్ సావంత్, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా తలపడ్డారు. బీజేపీ, శివసేన పొత్తులో భాగంగా ఇక్కడ గతంలో గెలిచిన శివసేన అభ్యర్థి సావంత్ మళ్లీ బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి దేవరా కూడా గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేశారు.మామూలుగా అయితే ఇక్కడ ఎన్నికకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ కార్పొరేట్ దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ స్వయంగా, బహిరంగంగా కాంగ్రెస్ అభ్యర్థి దేవరాకు తన మద్దతును ప్రకటించడంతో అందరి దృష్టి ముంబయి పై మళ్లింది. భారత రాజకీయాల్లో పార్టీలకు, అభ్యర్థులకు పారిశ్రామికవేత్తల తెరవెనుక సాయం చేయడం కొత్తేమీ కాదు. ఇది అందరికీ తెలిసిందే. ఎవరితో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతిపార్టీకి అనధికారికంగా ఎంతో కొంత విరాళం ఇవ్వడం సర్వసాధారణమే. కానీ ఒక అభ్యర్థికి బహిరంగంగా ఓ పారిశ్రామిక వేత్త మద్దతు తెలిపిన ఘటనలు లేవు. ఇదే తొలిసారి. కాంగ్రెస్ అభ్యర్థి దేవరాకు మద్దతు ఇచ్చినంత మాత్రాన ముఖేష్ అంబానీ బీజేపీకి వ్యతిరేకం అని చెప్పడం తొందరపాటు అవుతుంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి, ముఖ్యంగా మోదీకి అంబానీలు చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కూడా మిలింద్ దేవరా తోగల వ్యక్తిగత సాన్నిహిత్యం కారణంగానే ఆయనకు మద్దతు తెలిపారు. అంతే తప్ప బీజేపీ పై వ్యతిరేకతనో, కాంగ్రెస్ పై అభిమానమనో అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. బీజేపీ శ్రేణులతో ముఖ్యంగా ప్రధాని మోదీతో ముఖేష్ కు గల సన్నిహిత సంబంధాలు అందరికీ విదితమే. ముఖేష్ ఇంట జరిగిన వివాహ కార్యక్రమాలకు మోదీ హాజరవ్వడం ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు.ముఖేష్, మిలింద్ దేవరా సాన్నిహిత్యాన్ని పక్కన పెడితే ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ జరిగింది. గతంలో ఇక్కడి నుంచి మూడు సార్లు గెలుపొందిన మిలింద్ దేవరా పట్టున్న నాయకుడు. అయితే 2014 ఎన్నికల్లో మోదీ గాలిలో కొట్టుకుపోయారు. నాటి ఎన్నికల్లో శివసేన అభ్యర్థి సావంత్ ఆయనను 1.28 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ఈ నియోజకవర్గం పరిధిలో వర్లీ, బైకుల్లా, కొలాబో, మలబార్ హిల్స్, ముంబాదేవీ, సిమోరీ, ముంబయి దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరా గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆయన పెట్రోలియం శాఖా మంత్రిగా పని చేసిన రోజుల్లో అంబానీల కుటుంబానికి ఎంతో మేలు చేశారు. అందువల్లే ఆ కుటుంబం ఇప్పుడు మురళీ దేవరా కుమారుడు మిలింద్ దేవరా కు మద్దతు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలపై గల వ్యతిరేకత, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలు తనకు మేలు చేస్తాయని మిలింద్ దేవరా ధీమాగా ఉన్నారు. అదే సమయంలో కేంద్ర,రాష్ట్రాల్లో తమ పార్టీ భాగస్వామిగా ఉండటం తనకు కలసి వచ్చే అంశమని శివసేన అభ్యర్థి సావంత్ విశ్వాసంతో ఉన్నారు. ఎవరి నమ్మకం నిజమో తేలాలంటే ఈ నెల 23వ తేదీ వరకూ ఆగక తప్పదు

Related Posts