YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

భక్తికి భగవంతుడు ఎప్పుడూ దాసుడే

భక్తికి భగవంతుడు ఎప్పుడూ దాసుడే

యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:

శ్రీ వేంకటేశ్వరుడు అన్నమయ్య భక్తికి దాసుడై సకుటుంబముగా అన్నమయ్య వివాహానికి తరలివెళ్లి, అన్నమయ్య పల్లకీని, తనభుజాలమీద మోయలేదా?

1. పాహి పాహి ఇతహః పరంబెరుంగ, అని గజేంద్రుడు ప్రార్ధిస్తే....... అలవైకుంఠ పురంబులో అమూలసౌధంబులో,ఉన్న పరమాత్మ, పరుగెత్తి రాలా, అదీ ఎలావచ్చాడు? సిరికించెప్పడు, శంఖచక్రయుగముల్ చేదోయి సంధింపడు, అలా ఆగమేఘాలమీద పరుగు పరుగున పరుగెత్తి రాలా? ఎవరికోసం వస్తాడండీ? ఆయన దీనజన బాంధవుడు. త్రికరణ శుద్ధిగా భక్తితో ప్రార్ధిస్తే భక్తికి దాసానుదాసుడు.

2. కుచేలోపాఖ్యానములో కుచేలుడు (పరమ ప్రీతితో భక్తితో ) తెచ్చిన అటుకులకు పరవశించి అష్టైశ్వర్యములు ప్రసాదించలా?

3. కురుమహాసభలో అన్నా నీవేదిక్కు ,అని ద్రౌపతి తన రెండు చేతులూ పైకి ఎత్తి ప్రార్ధించగానే శ్రీ కృష్ణపరమాత్మ తామర తంపరగా వస్త్రదానము (చీరలు) ప్రసాదించలా?

4. శ్రీ త్యాగయ్య భక్తికి పరవశుడైన, శ్రీ సీతా రామచంద్రులవారు, లక్ష్మణ స్వామీ, అంజయనేయ స్వామి సమేతంగా త్యాగయ్య ఇంటికివచ్చి విందారగించలా?

5. శ్రీ రామదాసు భక్తికి దాసుడై, చనిపోయిన రామదాసు పుత్రుణ్ణి బ్రతికించాలా?

6. ఈ స్తంభములో నీ విష్ణువు ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడుగగా, ప్రహ్లాదుడు ఉన్నాడు, అని, ఇందుగల డందులేడ ని సందేహమేల, ఖచ్చితంగా ఉన్నాడు. అని చెప్పి ప్రహ్లాదుడు ప్రార్దించగా తన భక్తుని మాటకోసం, తన భక్తుని మాట నెలబెట్టడంకోసం స్వామి స్తంభమునుండి బయటకు రాలా? వచ్చి హిరణ్యకశిపున్ణి సంహరించలా?

7. శ్రీ తులసీదాసు భక్తికి తులసీదాసు తల్లి దగ్గర, రామయ్య వీపు వాతలు పడేలా దెబ్బలుతినలా? అమ్మా కొట్టద్దు,కొట్టద్దు అని దెబ్బలు తినలా?

8. వైర భక్తి పరాకాష్టకు నిదర్శనంగా హిరణ్యకశిపుడు, జరాసంధుడు, కంసుడు, శిశుపాలుడు, రావణాసురుడు వీరంతా మోక్షమును పొందాలా?

9. మూఢ భక్తికి నిదర్శనంగా తిన్నడు (కన్నప్ప ) తన కాలి చెప్పుతో, శివలింగము పై నిర్మాలిన్యాన్ని తీయగా,మరియు తిన్నడు శివునకు కన్ను పెట్టడానికి, కన్ను గుర్తుకొసం తన కాలి బొటనవ్రేలును, ఉంచి తనకన్నును తనశరీరము నుండి పెకలించి పెట్టగానే మోక్షాన్ని ప్రసాదించలా?

ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నోనిదర్శనములు ఉన్నాయి. ఒక విషయం ఆలోచించండి పైన ఉదహరించిన వారందరూ మానవ మాత్రులు కారా? మరి మనమూ మానవులమేకదా, మరి వారికి మనకు ఎక్కడుంది తేడా? వారికి పలికిన భగవంతుడు మరి మనకెందుకు పలకడు? ఎందుకు మాట్లాడడు? ఎవరికోసం పలుకుతాడండీ,ఎవరికోసం మాట్లాడుతాడు? మనలో ఆ భక్తి పారవశ్యమేది? భగవంతుని పట్ల సమాజము పట్ల ఆసేవాభావమేది.
భగవంతునికి మనము ఆ దాస్యం, సేవ చేస్తేకదా?

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అసలు దాస్యం, అంటే ఏమిటి? సేవచేయడం అంటే ఏమిటి తెలియాలి. దాస్యం ఎలాచేయాలి, సేవలు ఎలాచేయాలి, ఇవి తెలుసుకుంటే, అలా చేస్తే భగవంతుడు, పరమాత్మ మనకు దాసుడౌతాడా, లేదా, అనే విషయం తెలుస్తుంది. మహాభారతంలో పాండవుల పురోహితులైన శ్రీ ధౌమ్యుల వారు, ఓ ధర్మరాజా మీరింతవరకు, సేవలు, దాస్యము చేయించుకొన్నవారే కానీ దాస్యం చేయడం, సేవలు చేయడం చేసినవారుకారు. మీరు విరాటరాజు కొలువులో, సేవక వృత్తి, దాస్య వృత్తి చేయాలి.
సేవ, దాస్యము అనగా ఒక తల్లి తనబిడ్డకు ఏ ఏ పనులు చేస్తుంది. బిడ్డ అడిగితేనే చేస్తుందా? లేక ఏది తనబిడ్డకు అవసరమో అవి చేస్తుందా? తల్లికి తెలుసు తన బిడ్డకు ఎప్పుడూ ఏది అవసరమో, మలమూత్రము శుభ్రం చేసి, ఒక స్నానపానాదులే కాక ప్రతి చిన్న విషముము జాగ్రత్తగా గమనిస్తూ కంటికి రెప్పలా తనబిడ్డను తాను చూచుకొంటుంది. పాండవులకు సేవలుచేయు,విధానము గురించి మరియు దాస్యం, ఎలాచేయాలి, అనే విషయాల గురించి పాండవుల పురోహితులైన, శ్రీ ధౌమ్యుల వారు సవివరంగా వివరిస్తారు. అలా మనము కూడా భగవంతునికి, త్రికరణ శుద్దిగా, పంచేద్రియాలను ఒకటిచేసి, తపన,ఆర్తితో దాస్యం, సేవా (శరణాగతి) చేస్తే, భగవంతుడు మనకు, దాసుడుకాక ఎక్కడికి పోతాడు.

Related Posts