యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అయోధ్య భూ వివాదం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. మధ్య వర్తుల కమిటీ సమర్పించిన నివేదికపై సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఆగస్ట్ 15న సుప్రీం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తి చేసేందుకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోరింది. మధ్యవర్తిత్వ కమిటీ విఙ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ వివాదంపై నివేదిక సమర్పించేందుకు ఆగస్టు 15 వరకు సమయమిచ్చింది. మధ్యవర్తిత్వ కమిటీ ఇప్పటి వరకు సేకరించిన అభిప్రాయాలు, ఇతర అంశాలను ప్రస్తుతం వెల్లడించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. పత్రాల అనువాదంలో అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు పిటిషనర్లకు అనుమతిచ్చింది. కాగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్.ఎం.ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఎనిమిది వారాల పాటు ఈ కమిటీ ఫైజాబాద్‌లో చర్చలు జరిపి నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ఇటీవల న్యాయస్థానానికి సమర్పించింది.