రాయపాటి సాంబశివరావు సోదరుడి కుటుంబం టీడీపీ వీడనుందా. వైసీపీలో చేరే ఆలోచన చేస్తోందా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఏపీ రాజకీయాల్లో ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపుంది.రాయపాటి అడుగుజాడల్లో ఆయన సోదరుడు రాయపాటి శ్రీనివాస్ ఇప్పటివరకూ నడిచారు. తొలి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న రాయపాటి కుటుంబం2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరింది. రాయపాటి ఆరుసార్లు ఎంపీగా పనిచేశారు. శ్రీనివాస్ ఎమ్మెల్సీగా గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. రాయపాటి సోదరులు తర్వాత వారి వారసులుగా మోహన్‌సాయి కృష్ణ, రంగబాబు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయంటూ టీడీపీపై మోహన్ సాయికృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. హోదా విషయంలో కాంగ్రెస్, టీడీపీలను ఏ1, ఏ2,లుగా నిందిస్తూ ఏ3, ఏ4 అంటూ జనసేన, బీజేపీపై ఆరోపణలు చేశారు. టీడీపీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై గళం ఎత్తుతానని మోహన్ సాయికృష్ణ చెప్పడం హాట్‌టాపిక్ అయింది.హోదా పేరుతో మోహన్ సాయికృష్ణ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మోహన్ సాయికృష్ణ తండ్రి శ్రీనివాస్ సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ నుంచి సీటు ఆశించి భంగపడ్డారు. ఇలాంటి సమయంలో మోహన్ సాయికృష్ణ టీడీపీపై విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ఫలితాలు రాకముందే రాయపాటి కుటుంబంలో ఒకరు పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలను విమర్శించిన ఆయన వైసీపీపై పెద్దగా విమర్శలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మోహన్ సాయి వ్యాఖ్యలతో ఇప్పుడు రాయపాటి సాంబశివరావు సోదరుడి కుటుంబం టీడీపీ వీడనుందా వై సీపీలో చేరే ఆలోచన చేస్తోందా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. గతంలో గుంటూరు నగర మేయర్‌గా పనిచేసిన ఆయన ఇప్పుడు అదే సీటుపై ఆశలు పెట్టుకున్నారని, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న వేళ ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.