యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. మిక్స్ రివ్యూస్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీసును షేక్ చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముగ్గురు స్టార్ ప్రొడ్యూసర్లు సంయుక్తంగా నిర్మించడం విశేషం. మహేష్ కెరియర్‌లో ఒక చిత్రానికి ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌లు ఈ సినిమాను అత్యంత భారీ హంగులతో నిర్మించారు. కలెక్షన్ల విషయానికొస్తే.. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ‘మహర్షి’ రూ.33.5కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.61కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది మహేశ్‌బాబు కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లని సినీవర్గాల సమాచారం. ‘భరత్ అనే నేను’ సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.55కోట్ల గ్రాస్ రాబడితే ఆ రికార్డును ‘మహర్షి’ బ్రేక్ చేసేసింది. ఇటీవల కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే బడ్జెట్ రూ.వంద కోట్లు దాటేస్తోంది. ‘మహర్షి’ సినిమాకు రూ.135కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ, నైజాం, ఓవర్సీస్ అన్నీ కలుపుకుని రూ. 95 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. వీటితో పాటు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్ మరో రూ. 50 కోట్ల బిజినెస్ సాధించడంతో నిర్మాతలు సినిమా విడుదలకు ముందే సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. బయ్యర్లు నష్టాల్లేకుండా బయటపడాలంటే ఈ సినిమా రూ.100 కోట్లు షేర్ రాబట్టివల్సిన పరిస్థితి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్దే నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషించారు. మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మహేశ్ ఇరగదీసినట్లు సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సమ్మర్‌లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ‘మహర్షి’కి రెండు మూడు వారాల పాటు తిరుగుండదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.