యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కొన్నిరోజులుగా సీఎం చంద్రబాబు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల అంశంపై తన పోరాటాన్ని తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. తొలి మూడు విడతల పోలింగ్ సమయంలో తనను దూషించడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత రూటు మార్చారని మోదీ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఎవరికి అనుకూల పవనాలు వీస్తున్నాయో తెలిసిన తర్వాత ఈవీఎంలపై పడ్డారని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే క్రికెట్ లో కొన్నిసార్లు అవుటైన బ్యాట్స్ మెన్ అంపైర్ ను తప్పుబట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తన పరిస్థితికి ఎన్నికల సంఘంపై నిందలు మోపుతున్నారంటూ చంద్రబాబుపై మోదీ విమర్శలు చేశారు.కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలను ప్రధాని మోదీ శుక్రవారంనాడు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. బీజేపీ, ఎన్డీయేకు ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం కంటే ఎక్కువ సీట్లే వస్తాయని, పూర్తి మెజారిటీతో సుస్థిర ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలో సుడిగాలి ప్రచారం సాగిస్తున్న మోదీ 'ఏఎన్ఐ' వార్తాసంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేనందున ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న 44 మంది సభ్యుల కంటే కూడా తక్కువగానే ఈసారి సీట్లు వస్తాయని మోదీ అంచనా వేశారు. బీజేపీకి మెజారిటీ రాదనే అంచనాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలపై అడిగినప్పుడు, బీజేపీకి ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లే వస్తాయని ప్రజలు చెబుతున్నారని ఆయన అన్నారు. ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీలకు కూడా ఇప్పుడున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లే వస్తాయని, పూర్తి మెజారిటీతో పటిష్టమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో తాము ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. ప్రస్తుతం తమకు తగినన్న సీట్లు లేని చోట్ల కూడా మరిన్ని సీట్లు రాబోతున్నాయని, ఇండియాలోని నలుమూలల నుంచి తమకు సీట్లు పెగనున్నాయని ప్రధాని చెప్పారు.కాంగ్రెస్ కేవలం అబద్ధాలతో ప్రచారం సాగిస్తోందని, వారు చెప్పే అబద్ధాలకు ఎలాంటి ఆధారులు లేవని ప్రధాని విమర్శించారు. ప్రజలు ఆ విషయం గమినించారని, 2014లో సాధించిన 44 సీట్ల కంటే తక్కువ సీట్లకే కాంగ్రెస్‌ను పరిమితం చేయాలని ప్రజలు పట్టుదలగా ఉన్నారని పేర్కొన్నారు. 'మొదటి మూడు విడతల పోలింగ్ తర్వాత తమ పరిస్థితి దిగజారిందని గ్రహించడం వల్లే విపక్ష పార్టీలు నాపై నిందాపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నాయి. ప్రజలు తమకు అనుగుణంగా తీర్పునివ్వడం లేదని గ్రహించడం వల్లే నాపైన, ఈవీఎంలపైన, ఎన్నికల కమిషన్‌పైన విమర్శల దాడికి దిగుతున్నాయి' అని మోదీ అన్నారు. ఆట బాగా ఆడలేక, ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు సహజంగానే ఎంపైర్‌ను నిందించడం మొదలుపెడతారని, ఇప్పుడు విపక్షాలు చేస్తున్నది కూడా అదేనని విమర్శించారు.