
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పాంప్లెట్లను పంచిపెట్టడం వెనుక తాను ఉన్నాననే ఆరోపణల పట్ల గంభీర్ స్పందించాడు. ‘ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే బహిరంగంగా ఉరేసుకుంటాను.. లేదంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజకీయాల నుంచి వైదలగాలి. నా ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా?’ అని అరవింద్ కేజ్రీవాల్‌కు గంభీర్ సవాల్ విసిరాడు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే పోటీ నుంచి తప్పుకుంటానని గంభీర్ గురువారం ట్వీట్ చేశాడు. కేజ్రీవాల్ సీఎంగా ఉండటం సిగ్గుచేటని గంభీర్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై పరువునష్టం దావా వేస్తానని గంభీర్ హెచ్చరించాడు. ఆధారాలు లేకుండా ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేయడం సరికాదన్నాడు. ఎన్నికల్లో విజయం కోసం అరవింద్ కేజ్రీవాల్ దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించాడు. ఈస్ట్ ఢిల్లీ నుంచి ఆప్ తరఫున ఆతిషి, బీజేపీ నుంచి గౌతమ్ గంభీర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న పాంప్లెట్లు పంచారు. వీటి వెనుక గౌతమ్ గంభీర్ ఉన్నారని ఆప్ నాయకులు ఆరోపించారు. ‘గంభీర్ నువ్వింత నీచానికి పాల్పడతావని అనుకోలేద’ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ విమర్శలకు స్పందనగా గంభీర్ ఘాటుగా ట్వీట్లు చేశాడు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు తోటి క్రికెటర్లు బాసటగా నిలిచారు. తన ప్రత్యర్థి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషి గురించి గంభీర్ అసభ్య పదజాలంతో కూడిన కరపత్రాలు పంచారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. గౌతమ్ గంభీర్‌పై వస్తున్న వార్తలు విని షాక్ అయ్యామన్న వీరు.. మహిళలను అవమానించే విధంగా గంభీర్ ప్రవర్తించడని ట్విట్టర్ వేధికగా వ్యాఖ్యానించారు.తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ తనపై అసభ్య పదజాలంతో కరపత్రాలు ముద్రించి పంచుతున్నారంటూ ఆ నియోజకవర్గ ఆప్ అభ్యర్థి అతిషి గురువారం ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను నిరూపిస్తే తాను ఎన్నికల నుంచి తప్పుకుంటానని గంభీర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అతిషి, కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్‌కు గంభీర్ పరువునష్టం దావా నోటీసులు పంపారు.