ఓ యువకుడిపై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో చాలాదూరం గాయాలతోనే పరుగెత్తిన అతడు చివరకు ఓ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. పరిస్థితిని గమనించిన డ్రైవర్ బస్సును వేగంగా నడిపి బాధితుడిని కాపాడాడు. ఇదేదో సినిమాలో సన్నివేశం అనుకుంటున్నారా? కాదు. గురువారం రాత్రి తిరుపతిలో జరిగిన ఘటన. చిత్తూరు జిల్లా తిరుచానూరు యోగిమల్లవరానికి చెందిన మదన్‌కుమార్ రాత్రి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ తిరుపతి రూరల్ మండలం రామానుజపల్లె చెక్‌పోస్టు మీదుగా వెళ్తున్నాడు. చెక్‌పోస్ట్ వద్ద అప్పటికే మాటు వేసిన కొందరు వ్యక్తులు మదన్‌కుమార్‌పై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు శక్తినంతా కూడదీసుకుని పరుగు పెట్టాడు. కొంతదూరం వెళ్లాక అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి ఎక్కేశాడు. అయినప్పటికీ వెనక్కి తగ్గని దుండగులు వాహనాల్లో బస్సును వెంబడించారు. పరిస్థితి గమనించిన డ్రైవర్ బస్సును వేగంగా నడిపి బాధితుడిని కాపాడాడు. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎంఆర్ పల్లె రక్షక్ పోలీసులు బాధితుడిని రుయా ఆస్పత్రికి తరలించారు. మదన్‌కు చికిత్స చేసిన డాక్టర్లు అతడి శరీరంపై తొమ్మిది కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కార్వేటినగరంలో జరిగిన జంట హత్యల కేసుతో మదన్‌కు సంబంధం ఉందని, ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులు అతడిపై దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.