పెద్ద పెద్ద మాటలు చెప్పేవారు పనులు చేయరంటూ పరోక్షంగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ లోని సిద్దార్థనగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శుక్రవారం పాల్గని ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడారు. ప్రతి వ్యక్తి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందిఅని ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? రైతుల గోడు వినే తీరిక కూడా మోదీకి లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందే మోదీకి రైతులు గుర్తుకురావడం విడ్డూరంగా ఉందని అన్నారు. కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో మరో మోసానికి మోదీ తెరలేపారని దుయ్యబట్టారు. ఈ పథకం కింద రోజుకు రైతుకు రెండు రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. నేతలు చేస్తున్న వాగ్ధానాలను ప్రజలు పరిశీలించాలన్నారు. అవి ఎంత వరకు నిజమో.. కాదో తెలుసుకోవాలన్నారు. గతంలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసారా లేదా అని ప్రజలు ఆరా తీయాలన్నారు. రైతులకు మద్దతు ధర
ఇస్తామన్నారుకానీ అలా జరగలేదని ఆమె విమర్శించారు. దేశం నలుమూలల నుంచి రైతులు ఆందోళన చేస్తూ ఢిల్లీకి చేరుకున్నారు. కానీ ఆ రైతులను మోదీ కలవలేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ
పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే న్యాయ్ పథకం అమలు చేస్తామని, పేద ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.