యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఏపీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వాయువ్య భారత్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిపోతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సగటున 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశలున్నాయని వెల్లడించింది.మరోవైపు వేడిగాలుల తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం నుంచే వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చాలా చోట్ల కర్నూలు, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. చిన్నారులు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాగల రెండు మూడు రోజుల్లో కోస్తంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల మాత్రం సగటు ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్లు స్పష్టం చేసింది.