యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరును ఈసారి తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎక్కువ స్థానాలు దక్కించుకున్న వైసీపీ ఈసారి కూడా జిల్లాలో ఆధిపత్యం చూపించాలని కంకణం కట్టుకుంది. మరో వైపు గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను కాపాడుకోవడంతో పాటు కొత్తగా వైసీపీ స్థానాలను దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది. దీంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రత్యర్థిగా సవాల్ విసురుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఈసారి తంబళ్లపల్లె నియోజకవర్గం కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచి రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేయడంతో ఈసీటు రెండు పార్టీలకూ కీలకంగా మారింది2009లో టీడీపీ నుంచి గెలిచిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తర్వాత వైసీపీలోకి వచ్చి గత ఎన్నికల్లో తంబళ్లపల్లె నుంచి పోటీ చేసి సుమారు 10 వేల తేడాతో ఓడిపోయారు. ఆయనపై శంకర్ యాదవ్ టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు శంకర్ యాదవ్ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డిపై ఓడిపోయారు. 2014లో ఓటమి తర్వాత ప్రవీణ్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. మూడేళ్ల ఆయన యాక్టీవ్ అవుతారని ఎదురుచూసిన జగన్ తప్పని పరిస్థితుల్లో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని తీసుకువచ్చి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. రెండేళ్ల క్రితమే ఆయనకు టక్కెట్ పై జగన్ హామీ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి నియోజకవర్గంలో ద్వారకానాథ్ రెడ్డి ప్రజల్లో ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ముందున్నారు. పెత్తందారులు, భూస్వామ్య కుటుంబాలకు అడ్డా లాంటి తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆయన మొదటిసారి పోటీ చేశారు.తంబళ్లపల్లె నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రెడ్లదే హవా కొనసాగింది. 1955 నుంచి 2014 వరకు రెడ్లే విజయం సాధిస్తూ రాగా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి శంకర్ యాదవ్ బరిలో దిగి వారి రెడ్ల హవాకు బ్రేకులు వేశారు. గత ఐదేళ్లలో తాను నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశానని, హంద్రీనీవా ద్వారా నియోజవర్గానికి నీరు తీసుకువచ్చిన ఘనత తనదేనని చెప్పుకుంటున్నారు. అయితే, ఆయన ఎక్కువగా బెంగళూరులో ఉంటారని, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరనేది మైనస్ అయ్యింది. ఇక, ద్వారకానాథ్ రెడ్డి కూడా స్థానికేతరుడు కావడం, ప్రత్యక్ష ఎన్నికలకు కొత్త కావడం మైనస్ అయ్యింది. అయితే, పెద్దిరెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉండటం, పార్టీ బలం ఆయనకు కలిసి వచ్చింది. బీసీ సామాజకవర్గానికి చెందిన శంకర్ యాదవ్ కు బీసీల మద్దతు ఎక్కువగాఉంది. నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉండటంతో పాటు గ్రామ స్థాయిల్లో ఓట్లను ప్రభావితం చేయగలిగిన రెడ్లు వైసీపీ వైపు ఉన్నారు. ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో డబ్బు ప్రభావం కూడా బాగానే ఉంది. మొత్తంగా, ఈసారి తంబళ్లపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ టీడీపీకి అనుకూలంగా వేవ్ ఉంటే మాత్రం ఆ పార్టీ విజయం సాధించవచ్చు అనే అంచనాలు ఉన్నాయి