యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీకి కంచుకోట అది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎనిమిది సార్లు జరిగిన ఎన్నికలలో ఏడు సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే అక్కడ పసుపు పార్టీకి ఏ రకమైన బలం ఉందో ఇట్టే అర్థమవుతుంది. అలాంటి పసుపు కంచుకోటలో ఈసారి కూడా సైకిల్ పార్టీ విజయం సాధిస్తుందా? లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు బద్దలు కొడుతుందా? విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఎన్నికల అనంతరం విశ్లేషణలు చూస్తే ఎవరిది విజయం అన్నది చెప్పడం కష్టమే అయినప్పటికీ టీడీపీకి విజయావకాశాలున్నాయన్నది అందరూ అంగీకరించే విషయం.ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. శృంగవరపు కోటలో వరసగా రెండు సార్లు విజయం సాధిస్తూ వస్తున్న కోళ్ల లలిత కుమారి ఈసారి హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. లలితకుమారి తండ్రి కోళ్ల అప్పలనాయుడు శృంగవరపుకోట నియోజకవర్గం ఏర్పడటానికి ముందు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా అప్పటి వరకూ రిజర్వ్ డ్ నియోజకవర్గంగా ఉన్న శృంగవరపు కోట జనరల్ స్థానం అయింది. దీంతో 2009, 2014 ఎన్నికల్లో వరసగా కోళ్ల లలితకుమారి ఎస్ కోట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.గత ఎన్నికల్లో దాదాపు 30వేల మెజారిటీతో గెలిచిన కోళ్ల లలితకుమారి మరోసారి తన అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. కోళ్ల లలితకుమారికి నియోజకవర్గంలో మంచి పేరుంది. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండటం, అభివృద్ధి పనులు చేయడం, సంక్షేమ పథకాలను అందరికీ చేరవేయడంలో ముందున్నారు. దీంతో మరోసారి లలితకుమారికే చంద్రబాబునాయుడు టిక్కెట్ ఇచ్చారు. ఈసారి కూడా తాను భారీ మెజారిటీతో గెలుస్తానన్న ధీమాలో కోళ్ల లలితకుమారి ఉన్నారు. 2004లో తప్ప ఈ నియోజకవర్గంలో ఎన్నడూ టీడీపీ ఓడిపోకపోవడం తనకు అదనపు బలమని అంటున్నారు కోళ్ల లలితకుమారి.కోళ్ల లలితకుమారికి ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా ఈసారి కడుబండ శ్రీనివాసరావు బరిలోకి దిగారు. ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయలేదు. ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. అయితే ఇది ఇక్కడ నామమాత్రమే. జగన్ పాదయాత్రకు ఇక్కడ మంచి స్పందన రావడం, ప్రభుత్వంపై వ్యతిరేకత తనకు కలసి వస్తుందంటున్నారు కడుబండ శ్రీనివాసరావు. కానీ వైసీపీ ఇక్కడ గెలవడం మాత్రం అంత ఈజీ కాదంటున్నారు. కోళ్ల కుటుంబానికి ఉన్న పట్టుతో పాటు ఎమ్మెల్యే లలితకుమారిపై ఉన్నఅభిమానం ఆమెకే విజయాన్ని చేకూరుస్తుందన్నది టీడీపీ అభిప్రాయం. పోలింగ్ సరళి తర్వాత ఈ నియోజకవర్గం ఖచ్చితంగా సైకిల్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందన్నది విశ్లేషకుల అంచనా.