యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలు గెలుపోటముల సంగతి అలా ఉంచితే… పార్టీ క్యాడర్ ను ఉత్తేజపర్చే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ చంద్రబాబు రాజమహేంద్రవరం, అమలాపురం, శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలను మాత్రమే చేశారు. ఈ సమీక్షల్లో ఎక్కువగా తాను ఈ ఎన్నికల్లో ఎంత కష్టపడిందీ చెబుతున్నారు. యాభై ఐదు వేల మందితో ఎన్నికల సమయంలో 78 సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించామని చెప్పుకొస్తున్నారు.
అంతేకాకుండా ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ఆశీర్వదించారని పేర్కొంటున్నారు. ముఖ్యంగా తాను ఒక్క పిలుపు నిస్తే మహిళలు, వృద్ధులు సయితం గంటల తరబడి పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఉండటం, ఇతర ప్రాంతాల నుంచి పెద్దయెత్తున ఓటర్లు ఏపీకి రావడం వంటివి చంద్రబాబు ఎక్కువగా ఉదహరిస్తున్నారు. దీనికి తన మీద, పార్టీ మీద ఉన్న నమ్మకమే కారణమని చంద్రబాబు చెబుతున్నారు. ఓటింగ్ శాతాన్ని దెబ్బతీసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకున్నామని చెబుతున్నారు.అలాగే చంద్రబాబు కొత్తగా యాడ్స్ ప్రస్తావన ఈ సమీక్షల్లో తెస్తుండటం విశేషం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా రూపొందించిన ప్రకటనలు అందరినీ ఆకట్టుకున్నాయని, ప్రకటనల పట్ల తటస్థ ఓటర్లతో పాటు మహిళలు కూడా ఆకర్షితులయ్యారని చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికలను తొలిదశలోనే పెట్టడం పార్టీకి లాభించిందని విశ్లేషణలు చేస్తున్నారు. అప్పుడే పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ చెక్కులతో పాటు రైతు రుణమాఫీ చెక్కులు కూడా ప్రజలకు చేరడంతో వారు పార్టీకి అండగా నిలిచారన్న లెక్కలను చంద్రబాబు సమీక్షల్లో వేస్తున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో సమీక్షల్లో వాటికి కూడా చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్ గా తీసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. దీంతోపాటు ఖచ్చితంగా తిరిగి ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం రానుందని, కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా విశ్లేషణలు చేస్తున్న చంద్రబాబు మెజారిటీ తగ్గినా గెలుపు గ్యారంటీ అన్నా ధీమాను అభ్యర్థుల్లోనూ కలగ చేస్తున్నారు.