YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యూపీఏ3 కు మద్దతు కూడగట్టే పనిలో బాబు

 యూపీఏ3 కు మద్దతు కూడగట్టే పనిలో బాబు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నికలకు ముందే బీజేపీయేతర కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందే కూటమి ఏర్పడాలని భావిస్తున్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు దానిని పిలవకుండా నిరోధించడానికి ముందే కూటమిని ఏర్పాటు చేయడం మేలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సయితం అంగీకరిస్తున్నా,రు. ఇటీవల రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు జరిపిన సమావేశంలో దీనిపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వంద నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశముంది. దీంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ జతకడితే యూపీఏ 3ను ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేదీ కాదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన బీజేపీయేతర పక్షాలన్నీ సమావేశం కావాలని నిర్ణయించాయి. 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో రెండు రోజులు ముందుగా కూటమిని ఏర్పాటు చేసి ప్రకటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వారిలో ఉంది.అయితే దీనికి పశ్చమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ మోకాలడ్డినట్లు తెలుస్తోంది. ఈ నెల 21వ తేదీన సమావేశం ఏర్పాటు చేయడం సముచితం కాదని మమత చంద్రబాబుతో అన్నారు. ఈవీఎంల వద్ద పార్టీ కార్యకర్తలందరూ భద్రత కోసం ఉండాలని, ఈ పరిస్థితుల్లో సమావేశం ఏర్పాటు చేయడం మంచిది కాదని, బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి 21వ తేదీన సమావేశం కుదరదని మమత కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.నిజానికి ఈవీఎంల భద్రత అనేది మమత సాకుగానే చూపారని అర్థమవుతోంది. ఈవీఎంల వద్ద కాపలా ఉండాల్సింది క్యాడర్ కాని, నేతలు కాదన్న విష‍యం అందరికీ తెలిసిందే. కానీ మమత మాత్రం ఈవీఎం భద్రత పేరిట సమావేశాన్ని వాయిదా వేయించే ఉద్దేశ్యంతో ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఫలితాలు వచ్చిన తర్వాత కూటమి ఏర్పాటు బెటరని మమత భావిస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీయేతర పక్షాలను కూడగట్టి, సమావేశ పర్చే బాధ్యతను మాత్రం చంద్రబాబుపై మమత పెట్టడం విశేషం. శరద్ పవార్ ఇప్పటికే రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మాయావతి సయితం కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న కూటమి సమావేశం జరుగుతుందా? లేదా? అన్నది కూడా అనుమానమే. కూటమి ఏర్పాటుకు సమావేశం ఫలితాలు ముందే జరిగే అవకాశం లేదన్నది సుస్పష్టం.

Related Posts