యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీకి గట్టి ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గమది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బరిలో ఉన్న ప్రాంతమది. అందుకే ఈ నియోజకవర్గంపై అందరికీ ఆసక్తి నెలకొని ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగితే ఇప్పటివరకూ టీడీపీ ఆరు సార్లు గెలిచిందంటే ఆ పార్టీకి ఎంత పట్టుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా మంత్రి కళా వెంకట్రావు బరిలో ఉన్నారు. ఇటు సామాజిక వర్గం, అటు మంత్రిగా తాను చేసిన అభివృద్ధి టీడీపీ గెలుపును ఖాయం చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.పోలింగ్ తర్వాత వస్తున్న విశ్లేషణల ప్రకారం తెలుగుదేశం పార్టీ అనుకున్నంత సులువుగా లేదు. ఇక్కడ గట్టి పోటీని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు ఎదుర్కొన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. గత ఎన్నికల్లోనే కళా వెంకట్రావు అతి తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచారు. కేవలం 4,741 ఓట్లతోనే కళా గెలిచారు. అప్పుడు పరిస్థితులు వేరు. బీజేపీ, మోదీ ప్రభంజనం, జనసేన నేత పవన్ కల్యాణ్ సహకారం అన్నీ కళాకు కలసి వచ్చాయి. ఆయన ప్రజారాజ్యం పార్టీకి వెళ్లి తిరిగి టీడీపీలో చేరడంతో ఇక్కడ టీడీపీలోనే ఉన్న కొందరికి అసంతృప్తిగా ఉంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కావడంతో బయటకు చెప్పకపోయినా ఎన్నికల వేళ పరోక్షంగా కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా పనిచేశారని గుర్తించారు.ఇక ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన గొర్ల కిరణ్ కుమార్ మరోసారి బరిలోకి దిగారు. ఇక్కడ తూర్పు కాపు సామాజక వర్గ ఓటర్లు బలంగా ఉన్నారు. వీరి తర్వాత రెడ్డి, కాళింగ, మత్స్య కార ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసిన కళా వెంకట్రావు ఓటమి చవి చూశారు. ఈసారి కూడా బరిలోకి దిగిన కళా వెంకట్రావు, గొర్ర కిరణ్ కుమార్ లు ఇద్దరూ తూర్పు కాపు సామాజికవర్గం వారే. అయితే ఈసారి ఈ సామాజికవర్గం ఎక్కువ సంఖ్యలో వైసీపీ వైపు అండగానిలిచారంటున్నారు. ఇక మత్స్య కారులు సయితం వైసీపీకే జై కొట్టారన్నది ఇక్కడ విన్పిస్తున్న టాక్. అందుకే రాష్ట్ర అధ్యక్షుడు అయినా కళా వెంకట్రావు ఎచ్చెర్ల నియోజకవర్గానికే పరిమితమయ్యారట.అయితే కళా వెంకట్రావు విజయాన్ని కూడా కొట్టిపారేయలేమని చెబుతున్నారు. కళా వెంకట్రావు గెలిస్తే మరోసారి మంత్రి అవుతారన్నది ఇక్కడి బాగా ప్రచారం జరిగింది. మరోవైపు సంక్షేమ పథకాలను ఎచ్చెర్లలో క్షేత్రస్థాయిలో అందించడంలో టీడీపీ సక్సెస్ అయింది. అయితే గొర్ర కిరణ్ కుమార్ మాత్రం కళా వెంకట్రావు నాన్ లోకల్ అని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన రాజాం ప్రాంతానికి చెందిన వాడని వాడవాడలా ప్రచారంచేశారు. తాను రణస్థలంలో పుట్టానని, ఈ గడ్డకు చెందిన వాడినని లోకల్ ఫీలింగ్ ను వైసీపీ అభ్యర్థి తెచ్చారు. ఇలా హోరాహోరీగా పోరు జరిగిన నేపథ్యంలో ఎవరిది గెలుపు అన్నది మాత్రం ఇప్పటికీ తేల్చలేమంటున్నారు. ఎవరు గెలిచాన అతి స్వల్ప మెజారిటీ మాత్రమే వస్తుందని లెక్కలు వేస్తున్నారు.