యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. అత్యంత ఉత్కంఠ భరిత వాతావరణం సాగిన ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలోను ప్రధాన పార్టీలు కీలకమైన అభ్యర్థులను రంగంలోకి దించాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న డబుల్ హ్యాట్రిక్‌కు చేరువైన సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈయన 1994 నుంచి 2014 ఎన్నికల వరకు వరుసగా ఇక్కడ నుంచి విజయం సాధిస్తూనే ఉండడం గమనార్హం. అదేసమయంలో ప్రతి ఎన్నికల్లోనూ కొత్త ప్రత్యర్థులతోనే ఈయన తలపడుతుండడం గమనార్హం.1994లో ఆయన తండ్రి వీరయ్య చౌదరి ఆకస్మిక మృతి తర్వాత జరిగిన ఎన్నికల్లో టి.వెంకట్రామయ్యపై 1999లో చిట్టినేని ప్రతాప్‌బాబు, 2004లో మన్నవ రాజాకిషోర్, 2009లో మారుపూడి లీలాధర్‌రావు, 2014 ఎన్నికల్లో రావివెంకట రమణ పై పోటీ చేసి విజయం సాధించారు. ఇలా.. గడిచిన ఐదు ఎన్నికల్లోనూ విజయాన్ని వరిస్తూనే ఉన్నారు ధూళిపాళ్ల. అయితే, అప్పుడప్పుడు కొంత మేరకు మెజారిటీ తగ్గినప్పటికీ.. విజయం మాత్రం నరేంద్రుడి పక్షానే నిలుస్తోంది. ఈ ఐదు ఎన్నికల్లో ప్రతిసారి ఆయన కొత్త ప్రత్యర్థిపైనే గెలుస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ముగిసిన ఎన్నికలను కూడా ప్రతిస్టాత్మకంగా తీసుకున్నారు ధూళిపాళ్ల. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మొత్తం ఆరుసార్లు విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుందని, ఇది రాష్ట్ర, జిల్లా చరిత్రలోనే అద్భుత ఘట్టంగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నారు.అయితే, ఎలాగైనా సరే ధూళిపాళ్ల కు చెక్ పెట్టాలని భావించిన వైసీపీ ఇక్కడ ప్రయోగం చేసింది. గుంటూరు జిల్లాలో కీలకమైన మిర్చియార్డు ప్రెసిడెంట్, కీలన నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్యకు జగన్ టికెట్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వరకు గుంటూరు ఎంపీ సీటు ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయనకు జగన్ చివర్లో మోదుగుల ఎంపీగా పోటీ చేయడంతో పొన్నూరు సీటు ఇచ్చారు. ఇక ఆర్థికంగా కూడా స్థితిమంతుడైన కిలారు.. ఎన్నికల్లో హోరా హోరీగా ప్రచారం చేశారు. డబ్బు కూడా భారీగానే ఖర్చు చేశారు దీంతో గతానికి భిన్నంగా పొన్నూరులో ఈ దఫా పోరు పెరిగిందని అంటున్నారు పరిశీలకులు.నరేంద్రపై జనసేన ఎఫెక్ట్ కూడా గట్టిగానే ఉందని తెలుస్తోంది. అయితే, గుంటూరు నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన నాయకులు ఉన్నారు. అయితే, వీరు మాత్రం డబుల్ హ్యాట్రిక్ విషయానికి వచ్చేసరికి చతికిల పడ్డారు. మాజీ మంత్రులు మాకినేని పెదరత్తయ్య, కోడెల శివప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణలు ఈ జాబితాలోని వారే కావడం గమనార్హం. మరి వీరి సెంటిమెంట్‌ను ధూళిపాళ ఫాలో అవుతారా? లేక బ్రేక్ చేసి విజయం సాధిస్తారా? అనే విషయం ఆసక్తిగా మారింది. ఏదేమైనా ఇప్పుడు నరేంద్రకు ఓ లక్కీ సెంటిమెంట్.. మరో అన్ లక్కీ సెంటిమెంట్లు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.