యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిపితీరుతామని చెప్పిన చంద్రబాబునాయుడు ఆ దిశగా ఏం చేయలేకపోతున్నారు. ఈ నెల 10నే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎవరేం చేస్తారో చేసుకోండి అని ముందుగా చెప్పిన వారు ఎన్నికల షెడ్యూల్ ఉన్న సమయంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలంటే అనుసరించాల్సిన చర్యలు విని ఒక్క సారిగా హతాశులయ్యారు. ముఖ్యమంత్రి కోరగానే మంత్రి వర్గ సమావేశం పెట్టడానికి ఇది సాధారణ సమయం కాదని తెలుసుకున్న చంద్రబాబునాయుడు ఈ నెల 14కు మంత్రి వర్గ సమావేశం వాయిదా వేసుకోవడానికి
గత్యంతరం లేక అంగీకరించారు. ముఖ్యమంత్రి అంగీకరించిన తర్వాత అసలు ప్రొసీజర్ మొదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధం లేని అత్యవసర అంశాలను మాత్రమే ప్రతిపాదించాలని చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం సూచించడంతో నాలుగు విభాగాల కార్యదర్శులు కొంత మేరకు మంత్రివర్గ సమావేశంలో అత్యవసరంగా చర్చించాల్సిన అంశాలను ప్రతిపాదించారు. ఈ నాలుగు విభాగాల కార్యదర్శులు చెప్పిన విషయాలలో అత్యవసరంగా జారీ చేయాల్సిన జీవోలు ఇప్పటికే చాలా వరకు విడుదల అయ్యాయి. మంత్రివర్గం సమావేశమై తీసుకోవాల్సిన నిర్ణయాలు పెద్దగా లేవని నాలుగు విభాగాల అధిపతులు చెప్పినట్లుగా తెలిసింది.