యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇప్పటి వరకూ జరిగిన ఐదు విడతల ఎన్నికలలో మోడీకి మెజారిటీ వచ్చేలా కనిపించడం లేదనే రిపోర్టుల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా రెండు ప్రధాన నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నా కూడా జరిగే పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. 543 స్థానాలు ఉన్న లోక్‌సభలో సాధారణ మెజారిటీకి చేరాలంటే 272 స్థానాలు రావాల్సి ఉంటుంది. 2014 ఎన్నికలలో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఏ 336 స్థానాలు సాధించింది. మిత్రపక్షాలు కాకుండా ఒక్క బిజెపినే 282 స్థానాలలో గెలిచింది. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే ఎన్‌డిఏకు 166 స్థానాలు పెరిగాయి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఎన్‌డిఏ నుంచి చాలా మిత్రపక్షాలు దూరం అయ్యాయి. అందులో ఒకటి 16 స్థానాలు ఉన్న తెలుగుదేశం కాగా మరి కొన్ని చిన్న పార్టీలు దూరం జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యుపిఏ కేవలం 60 స్థానాలతో సరిపెట్టుకున్నది. ఒక్క కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 స్థానాలు మాత్రమే దక్కాయి.ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఎన్నికలలో బిజెపి మిత్రపక్షాలకు కలిపి దాదాపు 90 నుంచి 100 స్థానాలు తగ్గుతాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తున్నది. ఎన్‌డిఏ 236 – 246 మధ్య ఆగిపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 140 స్థానాల వరకూ సాధించే అవకాశం ఉంటుంది. అంటే గత ఎన్నికలలో కన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీనే 100 వరకూ స్థానాలు ఎక్కువ గెలవాల్సి ఉంది. ఆ వాతావరణం కనిపిస్తున్నట్లు కాంగ్రెస్ అంచనా వేసుకుంటున్నది. స్వతంత్రంగా 140 నుంచి 150 సీట్లు గెలవడంతో బాటు మిత్రపక్షాలకు కూడా సీట్లు పెరిగే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉన్న మిత్రపక్షాలకు తోడు కొత్తవారితో దోస్తీకి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఎన్నికల తర్వాతి పొత్తులకు ఈ సారి ఎంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ మేధావులు రంగంలో దిగుతున్నారు. టిఆర్ ఎస్ పార్టీ నుంచి సానుకూలత వ్యక్తం అయినట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కిల్స్‌లో బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టిఆర్ ఎస్ పార్టీ ఇప్పటి వరకూ అధికారికంగా లాంటి నిర్ణయం తీసుకోలేదు.