యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వలస పక్షుల భవిష్యత్ అనేది మనం తీసుకునే చర్యల మీదనే ఆధారపడి ఉంటుందని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ డైరెక్టర్ పేర్కొన్నారు.యూనెస్కో 2006 నుంచి వలస పక్షుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. వలస పక్షుల అవసరాలు, అలవాట్లను, వాటికి ఎదురౌతున్న సమస్యలను ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చర్చిస్తారు. వ్యర్థాలు, కాలుష్యం కారణంగా ప్రపంచ వారసత్వ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పర్యాటకం అభివృద్ధి చెందుతుందంటే ఆయా చారిత్రక ప్రదేశాల్లో చెత్తా చెదారం అదే స్థాయిలో పేరుకుపోతున్నట్లు లెక్క. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు పక్షులకు ప్రముఖ విరామ స్థలాలుగా ఉంటున్నాయి. కావునా ఈ చారిత్రక ప్రదేశాల పరిరక్షణంటే వలస పక్షుల సంరక్షణకు తీసుకుంటున్నట్లు చర్యలుగా భావించాలన్నారు. అందువల్ల ఎటువంటి కాలుష్యానికి పాల్పడకుండా ఆయా ప్రదేశాలను సందర్శించాలని పర్యాటకులను యూనెస్కో కోరింది. చాలా వారసత్వ ప్రదేశాల్లో ప్రత్యేకించి జల కాలుష్యం ప్రధాన సమస్యగా ఉంటుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, నూనెలు, పారిశ్రామిక వ్యర్థాలు పక్షులు, తాబేళ్లు, క్షీరదాల వంటి తదితర జీవుల మనుగడకే ముప్పు తెస్తున్నాయంది. సముద్రాలు కలుషితం అవడంతో అనేక జీవులు మరణిస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ రహితంగా సముద్ర తీరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని తెలిపింది. వారసత్వ ప్రదేశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేది మొదటి దశ అని పేర్కొంది.
వ్యర్థాలను తిరిగి ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలంది.