యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ సారె సమర్పించారు. మే 7వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 14వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. ముందుగా సారెకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆ తరువాత శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ రిజినల్ కమీషనర్ శ్రీమతి భ్రమరాంబకు టిటిడి ఈవో అందజేశారు. అక్కడి నుంచి మేళతాళాల మధ్య ఊరేగింపుగా సారెను గంగమ్మ ఆలయానికి తీసుకెళ్లారు.
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి, భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటున్నారు. ప్రతి ఏటా చైత్ర మాసంలో
జాతర సందర్భంగా నాలుగో రోజున అమ్మవారికి టిటిడి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను ప్రతిబింబించేలా అపురూపంగా జాతర జరుగుతుంది.ఈ సందర్భంగా భక్తులు బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి, సున్నపుకుండలు, పేరంటాలు తదితర వేషాలను ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో వరలక్ష్మి, శ్రీవారి ఆలయ షేష్కార్ లోకనాథం, విఎస్‌వో అశోక్‌కుమార్ గౌడ్, ఏఈవో ఉదయభాస్కర్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి, గంగమ్మ ఆలయ పాలకమండలి అధ్యక్షులు ఆర్‌సి.మునికృష్ణ, ఆలయ ఈవో కస్తూరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.