యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పవన్ కళ్యాణ్ విలక్షణ నటుడు. అంతకు మించి ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు. అందరు నడచిన బాటలో ఆయన నడవడు. ఆయన వైఖరి వేరేగా ఉంటుంది. ఎన్నికల ప్రచారం అయినా, ప్రత్యర్ధులను విమర్శించడం అయినా పవన్ ధోరణి వేరు అంటారు. ఇక పవన్ రెగ్యులర్ పొలిటికల్ లీడర్లకు భిన్నమని అంటారు. ఉవ్వెత్తున ఎన్నికల వేడి ఎగిసిపడిన వేళ కూడా పవన్ తనదైన శైలిలోనే ప్రచారం చేసుకుంటూ పోయారు. పవన్ తాను పోటీ చేసిన గాజువాక విషయంలోనూ అదే విధంగా వ్యవహరించారు. ఏప్రిల్ 21న నామినేషన్ దాఖలు చేసిన పవన్ ఆ తరువాత ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చి ర్యాలీలు నిర్వహించి ప్రచారం అయిందనిపించారు. మార్చి నెలాఖరు తరువాత పవన్ గాజువాక వైపు రాలేదు.ఇక జనసేన పోలింగ్ అనంతర పరిస్థితిపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. పవన్ స్వయంగా ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్షల్లో పాలుపంచుకుంటారని జనసేన నాయకులు చాలా రోజులుగా చెబుతూ వచ్చారు. అయితే అసలు విషయానికి వచ్చేసరికి పవన్ మాత్రం కనిపించకుండా పోయారు. దీంతో జనసేన కార్యకర్తలతో పాటు, ఆ పార్టీ అభిమానులు కూడా డీలా పడ్డారు. కనీసం పవన్ తాను పోటీ చేసిన గాజువాకకైనా వస్తారని అనుకున్నారు. చిత్రంగా పవన్ సోదరుడు నాగబాబు విశాఖ సమీక్షకు హాజరయ్యారు. గాజువాకలో జరిగిన అత్మీయ సమావేశంలో ఆయన పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ రాకపోవడంపై పార్టీలో చర్చ బాగానే జరిగింది. పవన్ మంచి మెజారిటీతో ఇక్కడ నుంచి గెలుస్తారని జనసేన నాయకులు చెప్పుకొచ్చారు. పవన్ మెజారిటీ 30 వేలుగా నిర్ణయించారు.అంతవరకూ బాగానే ఉంది కానీ పవన్ మరీ ముఖం చాటేయడమేంటన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. నిజానికి గాజువాకలో పవన్ కి మంచి అభిమాన గణం ఉంది. ఆయన సొంత సామాజికవర్గం కూడా భారీగా ఉంది. కానీ పవన్ గట్టిగా ప్రచారం చేయలేదనే చాలా మంది చివరి నిముషంలో రివర్స్ అయ్యారని టాక్ ఉంది. ఇక అభిమానులు మాత్రం పవన్ గెలవాలని మొక్కని దేవుడు లేడు. ఇంతగా పవన్ ను ఆరాధిస్తూంటే ఆయన రాకపోవడం ఏంటి అన్న బాధ క్యాడర్లోనూ, జనంలోనూ ఉంది. ఇపుడే ఇలా ఉంటే రేపు పవన్ గెలిచిన తరువాత కూడా పార్టీ నాయకులే వస్తారా..? ఆయన అసలు కనిపించరా…? అన్న నిష్టూరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి పవన్ ఎపుడు తీరిక చేసుకుని విశాఖ వస్తోడో…? ఉత్తరాంధ్ర నా ప్రాణమని చెప్పి పోటీ చేసిన పవన్ గెలిస్తే తప్ప రాడా….? అన్న విమర్శలు కూడా విపక్షాలు సంధిస్తున్నాయి. చూడాలి మరి జనసేనాని కరుణ ఎపుడు గాజువాక మీద పడుతుందో.