యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చంద్ర తోఫా, చంద్ర కానుక, చంద్రన్న బీమా వంటివి తెలుసుకానీ.. ఇదేంటి చంద్రన్న ఫార్ములా? అని అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ కూడా ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు, అధికారంలోకి రావడమే ధ్యేయంగా జగన్ అడుగు లు వేశారు. ఈ క్రమంలో జగన్‌ను తనకు ఇబ్బందిగా, తన పార్టీకి ఇబ్బందిగా ఉన్న జిల్లాలను గుర్తించి ఆయా జిల్లాల్లో ఈ ఫార్ములాను అమలు చేశారు చంద్రబాబు.చంద్రన్న ఫార్ములా అంటే.. తన పార్టీలోకి వచ్చేవారిని, తాను ఎంచుకున్న వారిని సైతం పార్టీలోకి ఆహ్వానించి, టికెట్లు కేటాయించడమే! ఇలా చేయడం ద్వారా తన పార్టీకిమెజారిటీ సీట్లు వస్తాయని చంద్రబాబు భావించారు. ఇలాంటి ప్రయో గాన్ని ఆయన వైసీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలులో చేశారు. ఈ జిల్లాలో కర్నూలు – నంద్యాల లోక్ సభ స్థానాలు 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 11 అసెంబ్లీ నియో జకవర్గాలను గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా హవా సాగించి
అధికారం చేజిక్కించుకున్న టీడీపీ జిల్లాలో కేవలం 3 అసెంబ్లీ స్థానాలకు సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి గత ఎన్నికలు ముగిసిన వెంటనే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలోకి
చేరిపోయారు.ఇక, ఆ తర్వాత కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా చేరిపోయారు. దీంతో టీడీపీ అంచనాలు దాటుతుందనే ప్రచారం జరిగింది. చివరకు పలువురు ఎమ్మెల్యేలు బలవంతంగా కొందరు, పదవుల ఆశతో మరికొందరు సైకిల్ ఎక్కేశారు. భూమా ఫ్యామిలీలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారు. చివరకు పార్టీ మారి వచ్చిన అఖిలప్రియ లాంటి వాళ్లకు చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టారు. నాలుగేళ్లలో చంద్రబాబు కర్నూలు జిల్లాలో వైసీపీ నుంచి నాయకులను తెచ్చుకున్నారేమో గాని.. స్థానికంగా వైసీపీ కేడర్ మాత్రం టీడీపీలోకి రాలేదు. ఇక ఎన్నికల వేళ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. అంతకు ముందు సైకిల్ ఎక్కిన ప్రజాప్రతినిధులు… ఎన్నికల వేళ తిరిగి ఫ్యాన్ గూటికి రివర్స్ జంప్ చేశారు.టీడీపీలో నేతల బండి ఓవర్‌లోడ్ అవ్వడంతో టికెట్ల కేటాయింపులో పరిస్థితి తారుమారైంది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి, ఎంపీ బుట్టా రేణుక వైసీపీలోకి వెళితే… ఇటీవల మృతి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి ఫ్యామిలీ జనసేనలోకి జంప్ చేసి ఏకంగా నాలుగు సీట్లు దక్కించుకుంది. దీంతో చంద్రబాబు తన ఫార్ములాను బయటకు తీశారు. కాంగ్రెస్ నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఫ్యామిలీని, వైసీపీపై అసంతృప్తితో ఉన్న గౌరు సుచరిత ఫ్యామిలీని కూడా బాబు తన పార్టీ లోకి ఆహ్వానించి టికెట్లు ఇచ్చారు. అయితే, ప్రత్యర్థులుగా ఉన్న వీరితో టీడీపీ నేతలు నిన్నమొన్నటి వరకు కలహాలు ఆడుతూనే ఉన్నారు. పైగా ఎన్నికల వేళ ఈ వైరం మరింత ఎక్కువైంది. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న కేఈ-కోట్ల- గౌరు-భూమా కుటుంబాలు మనుషులు కలిసి ఒకే పార్టీలో ఉన్నా.. మనసులు మాత్రం కత్తులు నూరుకున్నాయి. దీంతో చంద్రబాబు ఫార్ములా పైకి సక్సెస్ అయినా.. రిజల్ట్ మాత్రం ఫెయిలైందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లలో అయినా.. టీడీపీ నిలబడుతుందా? అంటే ఒకటి రెండు సీట్లు మినహా రిజల్ట్ సేమ్ టు సేమ్ అంటున్నారు.