యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వేసవిలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఊరూరా పశుగ్రాస క్షేత్రాల మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఖాళీగా ఉన్న పొలాలను రైతులు ప్రభుత్వానికి కౌలుకిస్తే ఎంటర్‌ఫెన్యూర్ ద్వారా గడ్డిని పెంచి, యంత్రాల సాయంతో ముక్కలుగా చేసి బేళ్లుగా మార్చి పశుపోషకులకు రాయితీపై సరఫరా చేస్తోంది. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు మెగా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. క్షేత్రాలను ఏడాది పొడవునా నిర్వహించుకోవడానికి రైతులకు రాయితీ సౌకర్యం కూడా కల్పించింది. అటువంటి అవకాశం లేనివారు కూడా పశుగ్రాసం పొందేందుకు వీలుగా రబీలో పశుగ్రాసం పెంచేందుకు ప్రభుత్వానికి రైతులు ఆరు నెలల పాటు తమ పొలాలను కౌలుకిచ్చే వెసులుబాటు కల్పించింది. ఆ మేరకు వెలగలేరు, చుట్టుపక్కల గ్రామాల రైతులు ఈ ఏడాది జనవరి నుంచి ఆరు నెలల పాటు ఎకరాకు రూ.15 వేలు చొప్పున కౌలు పొందేలా 41 ఎకరాలను ప్రభుత్వానికి అందజేశారు. ఒక వేళ రబీలో వరి వేస్తే ఎకరానికి రూ.8 నుంచి రూ.10 వేల వరకు మిగులుతాయని, కౌలుకు ఇవ్వడం వల్ల అంతకంటే అధికంగానే ఆదాయం వచ్చిందని రైతులు చెబుతున్నారుజి.కొండూరు మండలంలోని వెలగలేరు,
కందులపాడు, హెచ్.ముత్యాలంపాడు గ్రామాల్లో ఈ ఏడాది ప్రభుత్వం 41 ఎకరాలను కౌలుకు తీసుకొని ఎంటర్‌ఫెన్యూర్‌కు అప్పగించింది. గడ్డి పెంచడం మొదలు.. వాటిని కత్తిరించి బేళ్లను తయారు
చేసి ప్రభుత్వానికి అప్పగించడం ఎంటర్‌ఫెన్యూర్ పని. ఆత్మ ఎస్‌ఎఫ్‌ఏసీ సభ్యురాలు అలిగినేని శ్రీపద్మకు ఎంటర్‌ఫెన్యూర్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. 75 శాతం రాయితీపై కటింగ్ మిషన్, బేరింగ్ మిషన్ అందజేసింది. సాగు ఖర్చుగా ఎకరాకు రూ.15 వేలు అందజేసింది. బేళ్లుగా సిద్ధం చేసిన తరువాత ప్రభుత్వమే వాటిని కిలోల చొప్పున కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది 41 ఎకరాల్లో ఆమె ఆఫ్రికన్ మొక్కజొన్న విత్తనాలను వేశారు. ప్రస్తుతం మొక్కజొన్న పాలకంకి దశలో ఉండటంతో కోత ప్రారంభించారు. కూలీలతో మొక్కజొన్నను కోయించి అక్కడే సిద్ధం చేసిన కటింగ్ మిషన్‌తో వాటిని ముక్కలుగా చేస్తున్నారు. వాటిని తిరిగి మరో యంత్రం సాయంతో గట్టిగా అదిమి బేళ్లుగా సిద్ధం చేస్తున్నారు. ఆ బేళ్లను పశుసంవర్థక శాఖకు అప్పగించడం, లేదా పశుపోషకులకు రాయితీపై నేరుగా కిలో రూ.2లకే విక్రయించనున్నట్టు ఆమె తెలిపారుప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు ఆరు నెలల పాటు కౌలు లభించడంతో పాటు పశుపోషకులకు గడ్డి కొరత లేకుండా చేస్తోంది. రైతులు మరిన్ని ఎకరాలు ప్రభుత్వానికి కౌలుకిస్తే గడ్డి కొరతను పూర్తిగా అధిగమించవచ్చని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.