యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విశాఖ జిల్లాలో సైబర్ నేరాల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. మార్చి నెలతో పోల్చితే ఏప్రిల్‌లో ఈ నేరాలు తగ్గినా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో విశాఖ సిటీ నిలవడం విశేషం. మార్చి నెలలో 41 సైబర్ నేరాలు నమోదైతే.. ఏప్రిల్‌లో 35 కేసులు నమోదయ్యాయి. నేరాల సంఖ్యలో తగ్గుదల కనిపించినా ఇతర జిల్లాలతో పోల్చితే వీటి సంఖ్య చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. విశాఖ సిటీ తరువాత విజయవాడ సిటీలో అత్యధికంగా పది కేసులు నమోదయ్యాయి. గ్రామీణ జిల్లాలో కూడా సైబర్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి నెలలో రెండు కేసులు నమోదయితే ఏప్రిల్ నాటికి అవి రెట్టింపు అయి రాష్ట్రస్థాయిలో పదో స్థానంలో విశాఖ గ్రామీణ జిల్లా నిలిచింది.గంజాయి ఘాటులో జిల్లా అగ్రస్థానంలో ఉంది. రక్తమోడుతున్న రహదారుల చిత్రాన్ని మార్చాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నా రోడ్డు ప్రమాదాల తీవ్రత మాత్రం జిల్లాలో తగ్గనంటోంది. ఇతర నేరాల నియంత్రణలో పోలీసుల కృషి కనిపిస్తోంది. తొలిసారిగా విడుదలైన నెలవారి నేర నివేదికలో జిల్లాలో వెలుగు నీడలు
కనిపించాయి. కొన్ని నేరాల్లో విశాఖ నగరం అగ్రస్థానంలో ఉంటే కొన్ని రకాల నేరాల్లో గ్రామీణ జిల్లాలో తగ్గుముఖం కనిపిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ దిశగా తీసుకుంటున్న పటిష్ఠ చర్యల్లో భాగంగా సర్కారు నిశితంగా దృష్టిసారించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నెలవారి నివేదికలు ఇకపై ఇవ్వడంతో పాటు ఆ తీవ్రతపైనా సమీక్ష జరపనున్నందున నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఏప్రిల్ మాసాంత నివేదికలో జిల్లాలో చోటుచేసుకున్న నేరాల తీరును విశ్లేషించారు.వేధింపులు, వరకట్నం, అత్యాచారం, ప్రేమపేరుతో మోసాలు వంటి మహిళలపై జరుగుతున్న నేరాల్లో విశాఖ నగరం మొదటి స్థానంలో ఉంది. మార్చి నెలలో నగర పరిధిలో 68 కేసులు నమోదయితే ఏప్రిల్ నాటికి 103 కేసులు పెరిగాయి. నెల రోజుల వ్యవధిలోనే 51.5 శాతంపెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో విశాఖ గ్రామీణ జిల్లా మెరుగైన ఫలితాలు సాధించింది. మార్చిలో 32 కేసులు నమోదైతే ఏప్రిల్ నాటికి 24కు తగ్గాయి. 25 శాతం తగ్గుదలతో రాష్ట్రస్థాయిలో 14వ స్థానంలో నిలిచింది.హదారి ప్రమాదాల నివారణకు జిల్లా అధికారులు తీవ్రంగా కృషిచేస్తున్నా ఫలితాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. గ్రామీణ జిల్లా, నగర పరిధిలో సుమారు 120
కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. ఈ రహదారులపై నిత్యం ఏదోకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మార్చి.. నెలలో నగర పరిధిలో 126 రోడ్డు ప్రమాదాలు జరిగితే ఏప్రిల్ ఈ సంఖ్య 129కి పెరిగింది. గ్రామీణ జిల్లా పరిధిలో మార్చి నెలలో 70 ప్రమాదాలు జరిగితే ఏప్రిల్ నాటికి వాటి సంఖ్య 77కు చేరకుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యే జిల్లాల్లో విశాఖ సిటీ అయిదో స్థానంలో నిలిచింది. గ్రామీణ జిల్లా పరిధిలో ఏప్రిల్‌లో ఏడు ప్రమాదాలు పెరిగినా రాష్ట్రస్థాయిలో 12వ స్థానంలో ఉంది.