యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుని రాజకీయ అదృష్టవంతుడు అంటారు. ఆయన రెండు దశాబ్దాల క్రితం 1999 ఎన్నికల్లో టీడీపీ ద్వారా రాజకీయ అరంగ్రేట్రం చేశారు. తొలిసారి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత ఆయన 2004 ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో నెగ్గారు. ఇక 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లిలో పోటీ చేసి విజేతగా నిలిచారు. ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో గంటాకు మంత్రి పదవి దక్కింది. ఇక 2014 ఎన్నికల నాటికి టీడీపీలో చేరి భీమునిపట్నం నుంచి గెలిచి మంత్రి పదవిని చేపట్టారు. ఇలా అపజయం ఎరగని గంటా ప్రతీ ఎన్నికలోనూ గెలుస్తూ వస్తున్నారు.ఇక 2019 ఎన్నికలు మాత్రం గంటాకు పెద్దగా కలసివచ్చినట్లుగా లేదని అంటున్నారు. ఆయన ఆనవాయితీ ప్రకారం పార్టీలు మార్చలేదు. కానీ నియోజకవర్గాన్ని మార్చేశారు. ఐతే అది కూడా చివరి నిముషంలో మార్చడం వల్ల ఇబ్బందులు పడ్డారు. ప్రచారం కూడా సరిగ్గా చేయలేకపోయారు. మరో వైపు వైసీపీ నుంచి అభ్యర్ధి కేకే రాజు ఆరు నెలల ముందు నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుని రావడం, సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న బీజేపీ అభ్యర్ధి విష్ణుకుమార్ రాజు గట్టి పోటీ
ఇవ్వడంతో పాటు గంటా మీద చేసిన అవినీతి ఆరోపణలు జనంలోకి బాగా వెళ్ళిపోయాయి. పైగా విశాఖ నార్త్ లో అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు ఇక్కడ ఉండడంతో గంటా టఫ్ ఫైట్ ని ఎదుర్కొన్నారు. దాంతో మెజారిటీ సంగతి దేముడెరుగు గెలుస్తారా అన్న డౌట్లు తమ్ముళ్ళకే వస్తున్నాయి.ఇక గంటా రాజకీయ అదృష్టం ఈసారి ఎన్నికలతో తేలిపోతుందని ఆయన అనుచరులతో పాటు ప్రత్యర్ధులు కూడా అంటున్నారు. గంటా విశాఖ నార్త్ నుంచి ముందు మంచి మెజారిటీతో గెలవాలి. అదే సమయంలో పార్టీ కూడా అధికారంలోకి రావాలి. పరిస్థితి చూస్తూంటే ఈసారి ఈ రెండూ సాధ్యపడతాయా అన్న అనుమానాలు అనుచరుల్లోనే కలుగుతున్నాయి. గంటా అరకొర మెజారిటీతో గెలిచి టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి పదవి డౌటే అంటున్నారు. అదే విధంగా గంటా బంపర్ మెజారిటీ సాధించినా టీడీపీ అధికారంలోకి రాకపోతే ప్రతిపక్షం ఆయనకు తప్పదని కూడా అంచనా వేస్తున్నారు. మరి ఈసారి గంటా లక్కు
ఆయన్ని ఏ దిక్కుకు చేరుస్తుందో వేఛి చూడాల్సి ఉందంటున్నారు.