YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

కాకి.. హంస

కాకి.. హంస

కాకికి ఎక్కడ లేని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తాను నల్లగా ఉన్నానని..... తననెవరూ పట్టించుకోరని ...... అంతా తనను చూడగానే ఛీ ఛీ అంటారని....
ఒక రోజు ఒక హంసను చూసింది.
"ఎంత తెల్లగా ఉన్నావో... ఉంటే నీలా ఉండాలి!" అంది.
హంస నిట్టూర్చింది. 
" ఆ ..... ఏమి సుఖంలే! నాది ఒక్క తెలుపే. అదే రామచిలుకని చూశావా. రెండు రంగులుంటాయి దానికి. ఉంటే అలా ఉండాలి మరి!" అంది.
కాకి రామచిలుక దగ్గరికి వెళ్లింది. 
"చక్కగా రెండు రంగులతో అందంగా ఉన్నావు నువ్వు. ఆనందమంతా నీదే కదా!" అంది.
"ఆ ... ఏమి ఆనందంలెద్దూ. నావి రెండే రెండు రంగులు. నెమలిని చూడు. దానికి ఎన్ని రంగులుంటాయో. ఉంటే అలా ఉండాలి మరి" అంది.
కాకి నెమలి దగ్గరికి వెళ్లింది. అది జూలో పెద్ద పంజరంలో ఉంది.
"చక్కగా ఉన్నావు నువ్వు. నీ ఒళ్లంతా రంగులే. ఎంతో హాయిగా ఉన్నావు." అంది.
" ఆ ఏమి హాయి లెద్దూ. ఇన్నిరంగులున్నాయి కాబట్టే ఇదిగో ఇలా బంధించి పంజరంలో పెట్టారు. ఎన్ని రంగులుంటే ఏం లాభం. ఇలా బందీ బతుకు బతకాల్సి వస్తోంది. అసలు ఆనందమంటే కాకిది. దాన్ని ఎవరూ పట్టుకోరు. అది ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడికి వెళ్తుంది. దానికి బోనులు,పంజరాల బాధ ఉండదు. దానంత స్వేచ్ఛా జీవి ఇంకొకటి లేదు. బతికితే దానిలా బతకాలి" అంది.
కాకికి ఏమనాలో తెలియలేదు.... "కావు కావు" మంటూ హాయిగా రెక్కలు విప్పార్చుకుంటూ ఎగిరిపోయింది.

Related Posts