యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధ సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి), ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(ఓంక్యాప్) ఆధ్వర్యంలో ఈ ఏడాది 5వేల మందికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆసంస్థల ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి ప్రధాన కార్యాలయంలో విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేవారికి శిక్షణ ఇచ్చే సంస్థలు, రిక్రూటింగ్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఓంక్యాప్ జనరల్ మేనేజర్ డాక్టర్ స్వామితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓవర్సీస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, పలు శిక్షణా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఆయా శిక్షణా సంస్థలు, రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉండాలని అర్జా శ్రీకాంత్ సూచించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లినవారు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని.. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న దానిపై ఇప్పటికే అధ్యయనం చేశామన్నారు. ఎపిఎస్‌ఎస్‌డిసి, ఓంక్యాప్ ఆధ్వర్యంలో గ్లోబల్ స్కిల్ ట్రైనింగ్ సెల్(జి.ఎస్.టి.సి)ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సెల్ ద్వారా గల్ప్ దేశాలకు వెళ్లేవారు ఇబ్బందిపడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా మల్టీ స్కిల్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్, హాస్పటాలిటీ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్ లాంటి విభాగాల్లో 3నెలల శిక్షణ ఇచ్చేందుకు
ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. శిక్షణా కాలంలో ఇంగ్లీష్ తోపాటు ఏదేశానికి వారిని పంపాలనుకుంటున్నామో ఆదేశ భాషపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. తద్వారా అక్కడ భాషాపరమైన సమస్యలను వారు అధిగమించవచ్చన్నారు. అంతేకాకుండా శిక్షణ పూర్తయ్యేలోపే వీసా ప్రక్రియ పూర్తిచేయడం జరుగుతుందన్నారు. ఓంక్యాంప్ ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి ఆరోగ్య బీమా కల్పించడంతోపాటు ఓక్యాంప్ సంస్థ ప్రతినిధి, అక్కడి తెలుగు సంఘాలకు చెందిన ఫోన్ నంబర్ల బుక్ లెట్ వారికి ఇస్తామన్నారు. తద్వారా వారికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉంటామని అర్జా శ్రీకాంత్ అన్నారు.
అనంతరం ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(ఓంక్యాప్) చేపడుతున్న శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి ఆసంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ స్వామి వివరించారు. ట్రైన్డ్, టెస్టెడ్, సర్టిఫైడ్ మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా వచ్చే వారినే గల్ఫ్ దేశాల్లోని కంపెనీలు కూడా ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయని చెప్పారు. కాబట్టి మన రాష్ట్రంలోని శిక్షణా సంస్థలు, ఓవర్సీస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కూడా క్వాలిటీ ట్రైనింగ్, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓంక్యాంప్ ఎండీ అర్జా శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు ఈ ఏడాది 5వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఏజెన్సీలు కూడా సహకరించాలని స్వామి కోరారు. ఈ సమావేశంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఇతర సిబ్బందితోపాటు పలు ఓవర్సీస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.