యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాల మండపం రంగురంగల పుష్పాలతోను, విద్యుద్ధీపాలతోను శోభాయమానంగా ముస్తాబయింది. పరిణయ మండపం మొత్తాన్ని
బంగారుపూత ఫైబర్ రేకులతో అందంగా అలంకరించారు. వీటితోనే ఆర్చిలు, స్తంభాలు ఏర్పాటుచేశారు.
ఇందులో భాగంగా పరిణయ మండప ముఖద్వారానికి ఇరువైపుల అష్టలక్ష్మీ ప్రతిమలు, ముఖ మండపం పైన శ్రీ మహావిష్ణువు దశావతారాల అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
అదేవిధంగా బంగారు వన్నె స్థంభాలపై వెన్నతినే కృష్ణుడి బొమ్మలు ఏర్పాటు చేశారు. మండపం పైభాగంలో ఏర్పాటుచేసిన వెన్న ఉట్లు, వెండి గంటలు, పూల గుత్తులు ఆకట్టుకుంటు న్నాయి.
మండపం ఎదురుగా శ్రీ పద్మావతి సమేత శ్రీనివాసుడు, శ్రీమహాలక్ష్మీ అమ్మవారు, చుట్టూ నెమళ్ళు, ఏనుగుల సెట్టింగ్ ఏర్పాటు చేశారు.
ఇక శ్రీ మలయప్పస్వామి ఉభయనాంచారులతో కూడి వేంచేపు చేసే ఊంజల మండపానికి ఆపిల్, పైన్ ఆపిల్ నారింజ, ద్రాక్ష, మొక్కజొన్న కంకులు, అనాస, మామిడి, అరటి పండ్లతో అత్యద్భుతంగా
తీర్చిదిద్దారు. మండపం అలంకరణకు బంతి, చామంతి, వట్టివేరు, వాడామల్లి, నాలుగు రంగుల రోజాలు, ఆర్కిట్స్, కార్నస్ తదితర పుష్పాలను వినియోగించారు. అక్కడక్కడ చిన్నారి కృష్ణుని
లీలావినోదాలు ప్రస్ఫుటించేలా యాభైకి పైగా బాలకృష్ణుని బొమ్మలను మండపపు పందిరిలో అమర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలంకరణ మొత్తానికి ఒక టన్ను పుష్పాలు, 25 వేల కట్ ఫ్లవర్స్, 5 టన్నుల పండ్లు వినియోగించారు. టిటిడి గార్డెన్ విభాగం ఉప సంచాలకులు శ్రీ శ్రీనివాసులు పర్యవేక్షణలో బెంగుళూరు, చెన్నైకు
చెందిన 60 మంది నిపుణులైన అలంకరణ సిబ్బంది, టిటిడి గార్డెన్ విభాగంకు చెందిన మరో 60 మంది సిబ్బంది ఏప్రిల్ 21వ తేదీ నుండి శ్రీ పద్మావతి పరిణయోత్సవాల మండపాన్ని
రూపొందిస్తున్నారు. ఈ మండప అలంకరణకు పూణేకు చెందిన శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్టు వారు, చెన్నైకు చెందిన వెంకటచలంగారు టిటిడికి విరాళం అందించారు.