యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు గాను నిర్వహించిన ఏపీఈసెట్-2019 ఫలితాలు సోమవారం (మే 13న) విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో ఏపీ సాంకేతిక విద్యామండలి ఛైర్మన్ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ఈసెట్ ఫలితాల్లో 37,066 మంది విద్యార్థులు అర్హత సాధించారని వెల్లడించారు. వివిధ విభాగాల్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థుల వివరాలను విజయరాజు ప్రకటించారు. మే 19 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈసెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు తుది ఆన్సర్ 'కీ'ని కూడా అధికారులు విడుదల చేశారు. జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న నిర్వహించిన ఏపీఈసెట్-2019 పరీక్షలకు 37,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 1న ఈసెట్ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేశారు. మే 3 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం మే 13న ఫైనల్‌కీతోపాటు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.