యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల లోక్ సభ నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ సరళి, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలసత్వానికి అవకాశం ఇవ్వరాదనీ, కౌంటింగ్ ముగిసేవరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎన్నికలు ప్రతీ ఐదేళ్లకు ఓసారి వస్తుంటాయనీ, పార్టీ శాశ్వతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీచేయడం ఒక్కటే ముఖ్యం కాదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్ర, దేశ రాజకీయాలను టీడీపీ నేతలంతా అధ్యయనం చేయాలని సూచించారు. తాను నాలుగు రకాల సర్వేలు చేయించాననీ, అన్నింటిలో టీడీపీనే విజయం సాధిస్తుందని తేలిందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలిచాయని అభిప్రాయపడ్డారు.‘ప్రకృతి మనకు బాగా కలసివచ్చింది. లబ్ధిదారులకు చేయాల్సినంత సంక్షేమం చేశాం. వాస్తవానికి ఈ ఎన్నికలు మే నెలలో రావాలి. కానీ తొలిదశలోనే ఎన్నికలు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. తక్కువ గడువు ఇచ్చి టీడీపీని దెబ్బతీయాలనుకున్నారు. కానీ ఇదే టీడీపీకి కలిసి వచ్చింది. చెడు చేయాలనుకున్నా, మంచే జరిగింది. ఇకపై ప్రతినెల మొదటివారంలో లబ్ధిదారులకు పెన్షన్లు, ఆర్థికసాయం అందుతాయి" అన్నారు చంద్రబాబు.