యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడి జరిగిన రోజున .. అక్కడి వాతావరణం సరిగాలేదు. మబ్బులు ఎక్కువగా ఉన్నాయని, దాంతో ఆ సర్జికల్ మిషన్‌ను వాయిదా వేయాలని ఐఏఎఫ్ అధికారులు భావించారు. కానీ తాను ఇచ్చిన ఐడియా వల్లే బాలాకోట్‌పై దాడి జరిగినట్లు మోదీ చెప్పారు. మబ్బులు ఉన్నప్పుడే రాడార్లు పనిచేయవని తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తెలిపారు. ఆ కామెంట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వైమానిక దళ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌ను మోదీ కించపరుస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి రాడార్ సంకేతాలు మబ్బుల్ని దాటి వెల్లలేవా, మబ్బుల మీద నుంచి విమానాలు దాడి చేస్తుంటే.. రాడార్లు పనిచేయవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాలాకోట్ దాడిలో వైమానిక దళ అధికారులకు ఐడియా ఇచ్చినట్లు చెప్పుకుంటున్న మోదీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాడార్ల పనితనాన్ని మబ్బులు అడ్డుకోలేవన్న దానిపై శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులంటున్నారు. కేవలం రేడియో తరంగాల ద్వారా రాడార్లు పనిచేస్తాయని శాస్త్రవేత్తలంటున్నారు. మబ్బులు రాడార్లను అడ్డుకుంటాయని మోదీ చేసిన వ్యాఖ్యలను తొలుత షేర్ చేసినా, ఆ తర్వాత ఆ వీడియోను మాత్రం డిలీట్ చేశారు. వైమానికదళ నిపుణులకు మోదీ సలహా ఇచ్చారంటూ కొందరు నెటిజన్లు ఆన్‌లైన్‌లో జోకులు పేలుస్తున్నారు. ప్రతిధ్వనులు, సంకేతాలు బౌన్స్ అయినప్పుడు వాటిని రాడార్లు పసికడుతాయి. కానీ మబ్బుల నుంచి అటువంటి ప్రతిస్పందన ఉండదని నిపుణులన్నారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి మాత్రం మోదీపై సీరియస్ అయ్యారు. మోదీ బాధ్యతారహితమైన ప్రకటన చేశారన్నారు. ఇది జాతీయ భద్రతను నష్టపరుస్తుందన్నారు. ఇలాంటి వారు ఇండియాకు పీఎంగా ఉండరాదన్నారు. మోదీ వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేటన్నారు