యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి దిగిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన విజయం మీద బాగా ధీమాగా వున్నారు. తమ ఓటు బ్యాంక్ కి జనసేన చిల్లు పెట్టిందని చాలా మంది టిడిపి అభ్యర్థులు లబోదిబో మంటూ ఉంటే గోరంట్ల మాత్రం జనసేన తన నెత్తిన పాలు పోసిందని సంబర పడటం మిగిలిన వారికి ఆయన లెక్క మింగుడు పడటం లేదు. అదెలాగా అంటూ చిన్నన అంచనాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.2014 లో అనివార్యపరిస్థితి లో బిజెపి తో పొత్తు కారణంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన 8 వ సారి టికెట్ ను రాజమండ్రి అర్బన్ నుంచి రాజమండ్రి రూరల్ కు మారాలిసి వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో అక్కడి నుంచి అయిష్టంగా పోటీ చేసినా మోదీ గాలి, పవన్ కళ్యాణ్ మద్దతు తో బాటు టిడిపి పై ఉన్న సానుకూల పవనాలు అన్ని కలిసి గోరంట్ల కు పాతికవేల మెజారిటీ కట్టబెట్టేలా చేసింది. అయితే 2019 ఎన్నికల్లో సీన్ తారుమారు అయ్యింది. బిజెపి తో పొత్తు లేదు.పవన్ జనసేన మిత్రపక్షం నుంచి శత్రుపక్షం గా మారింది. వీటికి తోడు ప్రభుత్వ వ్యతిరేకపవనాలు ఇన్ని ఉన్నా ఈసారి తాను పాతికవేల మెజారిటీ తో గెలిచి వస్తున్నా అంటూ గోరంట్ల అధినేత ముందే సింహనాదం చేయడం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కాపుల అడ్డా గా పేరున్న రాజమండ్రి 2 నుంచి వైసిపి, జనసేన కాపు అభ్యర్థులనే నిలబెట్టాయి. వీరిద్దరి నడుమ కాపు సామాజిక వర్గ ఓట్ల చీలిక సునాయాసంగా తనను గట్టున పడేస్తాయని గోరంట్ల లెక్క కట్టడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. బిసి ఓటు బ్యాంక్ తనకు పూర్తి అండగా నిలబడటంతో బాటు మిగిలిన ప్రత్యర్థుల కన్నా తమ పార్టీ డబ్బు నుంచి అన్నిటా సక్రమంగా ఓటరుకు చేరవేసిన అంచనాలతో బుచ్చయ్య తనకు తిరుగులేదని భావిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా.