యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో ఈ దఫా పూర్తిగా రెండు ఎంపీ స్థానాలు సహా అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించాలని ఆయన గట్టిగా డిసైడ్ అయ్యారు. రెండేళ్లుగా తన సొంత జిల్లాపై జగన్ పెద్ద కసరత్తే చేశారు. గత ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యే స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మిగిలిన వాటిలో వైసీపీ దూకుడు ప్రదర్శించింది. ఆ తర్వాత రాజంపేటలో టీడీపీ నుంచి గెలిచిన మేడా మల్లిఖార్జునరెడ్డి కూడా వైసీపీలోకి జంప్ చేసేశారు. ఇక, ఇప్పుడు జరిగిన తాజా ఎన్నికల్లో మాత్రం టీడీపీని పూర్తిగా నిలువరించి తన సొంత జిల్లాలో హవా ప్రదర్శించాలని జగన్ భావిస్తున్నారు. అయితే, టీడీపీ కూడా అంతే కసితో ఇక్కడ విజయం సాధించాలని చూస్తోంది. కనీసం నాలుగు నుంచి ఐదు స్థానాల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేసింది.జగన్ ఎత్తులకు ధీటుగా ఎన్నికలకు రెండు ఏళ్లు ముందుగానే టీడీపీ అధినేత చంద్రబాబు.. కడపపై దృష్టి పెట్టారు. ఇక్కడ మెజారిటీ స్థానాల్లో టీడీపీ హవా పెరిగితే.. జగన్‌ను నైతికంగా దెబ్బతీయొచ్చని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకు స్థాపన చేశారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల రైతులను టీడీపీ వైపు మళ్లించేందుకు గాను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా
కృష్ణాలో వచ్చిన మిగులు నీటి నుంచి సాగునీరు పులివెందులకు అందించారు. ఇక్కడ 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడ్డ దివంగత వైఎస్ వివేకాను ఓడించారు. ఇలా వ్యూహ ప్రతివ్యూహాలతో చంద్రబాబు ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నించారు. తాజా ఎన్నికల్లోనూ ఆయన కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను చంద్రబాబు రంగంలోకి దింపారు. అందరూ స్థితి మంతులు కావడం గమనార్హం. మైదుకూరులో టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు, రైల్వేకోడూరులో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్, రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి గెలుపుపై టీడీపీ చాలా ఆశలే పెట్టుకుంది. ఇక జమ్మలమడుగులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరన్న ధీమాలో ఉంది.సమయంలో మిగిలిన జిల్లాలకు కూడా ఇవ్వనంతగా చంద్రబాబు ఇక్కడివారికి ఎన్నికల నిధులు అందించారని సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ వర్సెస్‌టీడీపీ భారీ పోరు సాగింది. ఇటు జగన్ క్లీన్‌స్వీప్ ఖాయమన్న ధీమాతో ఉంటే ఈ సారి చంద్రబాబు కనీసం 4-5 సీట్లు గెలుస్తామని చెపుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ తన సొంత జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని పెట్టుకున్న లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుంది, అదే సమయంలో చంద్రబాబు వ్యూహం ఏ మేరకు ? వర్కవుట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది