యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల ముందు ఎన్నో మాటలు, మరెన్నో హామీలు, బాండ్ పేపర్లు. అద్దె ఇల్లు తీసుకోవడాలు… ఇలా చాలా చేశారు. మరెన్నో చెప్పి మేము మీవాళ్ళమేనని అంటూ ముందుకు వచ్చారు. . తీరా ఎన్నికలు అయ్యాక చూస్తే సీన్ రివర్స్. ఇపుడు ఎవరూ కనిపించరు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా విశాఖలో పోటీ చేసినా వారంతా తమ తమ స్థావరాలకు క్షేమంగా వెళ్ళిపోయారు. గెలిస్తే ఏం చేస్తారో కానీ ఇపుడు మాత్రం నాన్ లోకల్ అనిపించుకున్నారు. ఈసారి విశాఖ ఎంపీ అభ్యర్ధులుగా ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన వారంతా నాన్ లోకల్ అన్న మాట గట్టిగా వినిపించింది. బీజేపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరిది ప్రకాశం జిల్లా, ఆమె ఉండేది హైదరాబాద్. ఇక జనసేన నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మీనారయణది అనంతపురం జిల్లా కదిరి. ఆయన సైతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రీభరత్ కూడా హైదరాబాద్ లో ఉంటారు. దాంతో ఇపుడు వీరంతా విశాఖను దాదాపుగా వదిలేశారనే చెప్పాలి.తాను ఎంపీగా గెలిచినా, ఓడినా ఇప్పటి నుంచి విశాఖలో ఉంటానని, ఇచ్చిన హామీలన్నీ తీరుస్తానని వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి మరీ ఇచ్చారు. విశాఖలో ఓ అద్దె ఇల్లు కూడా ఆయన తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం అక్కడ నుంచే చేసారు. పోలింగ్ ముగిసిన తరువాత నాలుగు రోజులు గడిపిన జేడీ ఇపుడు కనిపించడంలేదని అంటున్నారు. ఆయన తన సొంత నివాసానికి
వెళ్ళిపోయారని చెబుతున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత పురందేశ్వరి, శ్రీ భరత్ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు. శ్రీ భరత్ అయితే ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు ప్రచారం కోసం, పురంధేశ్వరి
కూడ అంతే. ఇక వైసీపీ తరఫున పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణ మాత్రం విశాఖలో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయన కూడా గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారే. గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఆరు నెలలకు గాను అక్కడ అద్దె ఇల్లు తీసుకున్నట్లుగా ఓటర్లకు చూపించారు. అక్కడ పవన్ ఒక్క పూట కూడ గడపలేదు. కానీ పార్టీ నాయకులు మాత్రం ఆరు నెలల అద్దె చెల్లించామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న తరువాత పవన్ గాజువాక రావడం మానేశారు. మరి పవన్ గత ఏడాది విశాఖ పర్యటనలో మాత్రం నాన్ లోకల్ విశాఖ వాసులకు తీరని అన్యాయం చేశారని ఘాటుగా విమర్శలు చేశారు. సరే ఇవన్నీ ఇలా ఉంటే ఇందులో ఎవరు గెలిచినా విశాఖలో పూర్తిగా ఉంటారా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పదవులు దక్కాక వారి చిరునామాలు పూర్తిగా మారిపోతాయి. ఇది విశాఖకు కొత్త కాదు, మూడు దశాబ్దాలుగా ఇదిలాగే సాగుతూనే ఉంది.