యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మధ్యప్రదేశ్ లోని భోపాల్ పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలాలు కొన్ని దశాబ్దాలుగా లేవు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను బరిలోకి దించింది. దిగ్విజయ్ సింగ్ అయితేనే నెట్టుకురాగలరన్న నమ్మకంతో ముఖ్యమంత్రి కమల్ నాధ్ ఆయనను రంగంలోకి దించారు. అయిష్టంగానే రంగంలోకి దిగినా డిగ్గీరాజా ప్రచారంలో జోరు పెంచి తనకు సానుకూలత పెంచుకున్నారు. భోపాల్ అంటేనే బీజేపీ.. బీజేపీ అంటేనే భోపాల్… అన్నట్లు ఉండేది. 1989 ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా కమలం కంచుకోటను బద్దలు కొట్టాలని నిర్ణయించింది. కనీసం పోటీ ఇచ్చినా భారతీయ జనతా పార్టీకి మిగిలిన నియోజకవర్గాల్లో చెక్ పెట్టవచ్చని భావించింది. అందుకోసం దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించింది. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ పై తరచూ విరుచుకుపడే దిగ్విజయ్ సింగ్ అయితేనే ఇక్కడ పోటీ ఇవ్వవచ్చన్న ఏకైక కారణమే ఆయనను అభ్యర్థిగా మార్చింది.మరోవైపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆలస్యంగా నిర్ణయించడమే డిగ్గీరాజా మీదున్న అనుమానానికి కారణమన్న వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ నుంచి విన్పిస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్ పై మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ను బరిలోకి దింపింది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం తెచ్చి పెట్టాయి. దీంతో నష్టనివారణకు ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. భోపాల్ లోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, భజరంగ్ దళ్, దుర్గావాహిని కార్యకర్తలు ప్రచారం చేశారు. వారే సాధ్వి విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు.దిగ్విజయ్ సింగ్ తరచూ సంఘ్ పరివార్ పై చేసే వ్యాఖ్యలతో ఆయనను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదల సంఘ పరివార్ లో కన్పించిందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే సాధ్వి ప్రజ్ఞాసింగ్ పట్ల ప్రజల్లో అంత ఆదరణ కన్పించలేదన్న కామెంట్స్ బీజేపీ నుంచే విన్పిస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్ తన ప్రచారంలో ప్రజ్ఞాసింగ్ ను కాని, బీజేపీపై కాని ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తన ప్రచారం ముగించారు. అదే ఆయనకు అనుకూలంగా మారిందంటున్నారు. మొత్తం మీద దిగ్విజయ్ సింగ్ ఇక్కడ గెలిస్తే ఆయన ఎన్నో రికార్డులను బద్దలు కొట్టే అవకాశముంది.