యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
టాలీవుడ్ ని ఒక్క కుదుపు కుదిపిన డ్రగ్ కేనులో సిట్ అధికారులు కేవలం నాల్గింటిలో మాత్రమే చార్జిషీట్లు దాఖాలు చేసినట్లు సమాచార హక్కు చట్టం కింద ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ డ్రగ్ కేసులో అప్పట్లో ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పలువురు సినీ ప్రముఖులను విచారించారు. కానీ, ఆ తర్వాత ఈ కేసు మరుగున పడింది. దీంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసు వివరాలను సేకరించారు.ఈ కేసులో 62 మంది హీరో, హీరోయిన్స్, దర్శకులు, సినీ తారగణంలోని ప్రముఖులనుండి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించి వారి వాంగ్మూలాన్ని సైతం సిట్ బృందం నమోదు చేసింది. సిట్ అధికారులు 12 కేసులను నమోదు చేశారు. అందులో నాల్గింటిలో మాత్రమే చార్జిషీట్లు దాఖలయ్యాయి. విచిత్రం ఏమిటంటే విచారించిన అరవై మందిలో ఏ ఒక్కరిపైనా చార్జిషీట్ నమోదు చేయకపోడం గమనార్హం. దాఖలైన చార్జిషీట్లను పరిశీలిస్తే సిట్ అధికారులు ప్రముఖ సినీ సెలబ్రెటీలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా ఉంది.
టాలీవుడ్ డ్రగ్ కేసులో విచారణ లోపభుయిష్టంగా ఉందని, కేసు నత్తనడక సాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషికి పద్మనాభ రెడ్డి ఈ నెల ప్రారంభంలో ఒక లేఖ రాసారు. డ్రగ్ వాడకం సినీ రంగంనుండి నెమ్మదిగా చాపకింద నీరులా కార్పొరేట్ విద్యారంగంలోకి విస్తరిస్తుందన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల ఊబిలో కూరుక పోకముందే డ్రగ్ మాఫియాపై తెలంగాణా ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని డిమాండ్ చేశారు.