యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో తెలుసా? ఎవరేమిటి చంద్రబాబునాయుడు కదా అనే అంటారు చాలా మంది. చంద్రబాబునాయుడు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడు కళా వెంకటరావు. అయితే పాపం కళా వెంకటరావుకు ఆ పదవి అయితే ఉంది కానీ హోదా ఎప్పుడూ దక్కలేదు. దక్కదు కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థ అలాంటిది. రాష్ట్రంలో పోలింగ్ పూర్తి అయిన తర్వాత చంద్రబాబునాయుడు పార్టీ సమీక్షలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. పార్లమెంటు స్థానాల వారీగా చంద్రబాబునాయుడు సమీక్షలు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధుల నుంచి అన్ని వివరాలను ఆయన తీసుకుని తాను చేయించిన సర్వేతో సరిపోల్చుకుంటున్నారు. ఎవరు ఎక్కడ గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే నిర్ణయానికి రావడానికి ఆయన ఇదంతా చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇంత శ్రమపడుతున్నారని అనుకోవచ్చు. అందులో తప్పులేదు కూడా. మరి ఆ సమీక్షలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పిలవరా? లేక పార్టీ పిలిచినా వెళ్లడం లేదా?అసలు ఆయనను పిలుస్తున్నారా?ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయంటే
ఇప్పటి వరకూ జరిగిన ఏ సమీక్షా సమావేశానికీ కళా వెంకటరావు వెళ్లలేదు. ఇలా చెప్పగానే తెలుగుదేశం సోదరులు ఎగబడతారు నాకు తెలుసు. తొలి సమీక్షా సమావేశానికి కళా వెంకటరావు వెళ్లారు. ఆ తర్వాత ఆయన జిల్లా సమీక్షా సమావేశానికి మాత్రమే ఆయన వెళ్లారు. మధ్యలోగానీ ఆ తర్వాత గానీ ఏ సమావేశానికి ఆయనను పిలవలేదు. ఆయన వెళ్లలేదు. స్వతంత్రించి వెళ్లి ఉంటే బహుశ ఆయనను లోనికి కూడా రానిచ్చేవారు కాదేమో. అందుకే ఆయన వెళ్లి ఉండరు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరచిపోయారా లేక పిలవలేదా అనేది ప్రశ్నార్ధకం కాగా ఆ సమీక్షా సమావేశాలకు పిలిస్తే కళా వెంకటరావు ఆ వివరాలను బయటకు లీక్ చేస్తారని చంద్రబాబు భావించారా అనేది మరో ప్రశ్న.అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ సమీక్షల తర్వాత చంద్రబాబునాయుడు బయటకు వచ్చి తెలుగుదేశం అఖండ మెజారిటీతో గెలుస్తుందని చెప్పడం తప్ప మరే వివరాలు బయటకు రావడం లేదు. పోటీ చేసిన అభ్యర్ధులు క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో
తెలిసినా కూడా చంద్రబాబుకు ఆనందం కలిగించే విధంగానే నివేదికలు ఇస్తున్నారని మాత్రం తెలుస్తున్నది. సమీక్షల సంగతి ఎలా ఉన్నా పార్టీ అధ్యక్షుడుగా కళా వెంకటరావు మాత్రం నోటిలో నాలుకలేని ఒక కీలుబొమ్మగా మిగిలిపోయారు. పేరుకు మాత్రం బిసిలకు అధికారం ఇచ్చామని చెబుతారు. నేతిబీరకాయలో నేయి చందంగా ఉంది వ్యవహారం.