యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ జగన్ ధీమాతో ఉన్నారు. తమ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ సేవలను పాలనలోనూ ఉపయోగించుకుంటామని జగన్ చెప్పడమే దీనికి నిదర్శనం. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ అధికారం చేజిక్కించుకోవడం పక్కా అని భావిస్తోన్న జగన్.. తన మకాంను హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చబోతున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి రెండ్రోజుల ముందు ఆయన లోటస్ పాండ్ నుంచి తాడేపల్లిలోని కొత్తింటికి మారబోతున్నారు. ఫిబ్రవరి 27న జగన్ గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. మే 21న జగన్ తాడేపల్లి నివాసానికి మకాం మార్చుతున్నారని వైసీపీ నేత ఒకరు తెలిపారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే.. వెంటనే అధికారిక నివాసంలోకి మారతారని ఆయన చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లోనే ఉంది. ఇక్కడే ఆయన నివాసం ఉంటున్నారు. విజయవాడలో పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసినా.. ఎక్కువ శాతం పార్టీ కార్యక్రమాలు, కీలక భేటీలు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూడా అమరావతికి మార్చేయనున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీసుకు సంబంధించిన ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను లోటస్ పాండ్ నుంచి తాడేపల్లికి తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలన్నీ అమరావతి కేంద్రంగానే సాగుతాయి. జగన్ హైదరాబాద్‌లోనే ఉండటం పట్ల ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు నాయుడు పదే పదే విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.