YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వినాయక్ హీరోగా సినిమా

వినాయక్ హీరోగా సినిమా

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

డైరెక్టర్ వి.వి.వినాయక్ పేరు చెప్పగానే ‘ఆది’, ‘దిల్’, ‘ఠాగూర్’, ‘బన్నీ’, ‘లక్ష్మీ’, ‘నాయక్’ వంటి సూపర్ హిట్ కమర్షియల్ సినిమాలు గుర్తుకొస్తాయి. హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఆయన. మాస్ ఎలిమెంట్స్‌కు కామెడీని జతచేసి బ్లాక్ బస్టర్లుగా మలిచిన దర్శకుడు వినాయక్. ఈయన ఖాతాలో బ్లాక్ బస్టర్లు ఎన్నున్నాయో ఓ మాదిరి, ఫ్లాప్ చిత్రాలు కూడా అన్నే ఉన్నాయి. అయినప్పటికీ వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో సినిమా అంటే ప్రేక్షకులు అమితాసక్తి చూపుతారు. హీరోలు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ‘అఖిల్’ వంటి భారీ డిజాస్టర్ తరవాత కూడా చిరంజీవి పిలిచి ‘ఖైదీ నెంబర్ 150’ బాధ్యతలు అప్పగించారంటే వినాయక్ స్టామినా ఏమిటో అర్థమవుతుంది. ఇన్నాళ్లూ డైరెక్టర్‌గా మెప్పించిన వినాయక్ ఇప్పుడు హీరో అవతారమెత్తుతున్నారని టాక్. వినాయక్‌ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో బలంగా వినిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనే వార్త మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దర్శకుడు శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌.నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. గతంలో ఈయన ‘శరభ’ అనే సినిమాను తెరకెక్కించారు. మరో రెండు నెలల్లో చిత్రీకరణ ప్రారంభం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వయసులో వినాయక్ హీరో ఏమిటి అని ప్రేక్షకుల్లో ఓ ప్రశ్న తలెత్తే అవకాశముంది. అయితే, ఈ సినిమా కథ నడి వయస్సు వ్యక్తికి సంబంధించినదేనట. ఈ పాత్రకు వినాయక్ అయితే కరెక్ట్‌గా సరిపోతారని దర్శక, నిర్మాతలు ఆయన్ని ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. వినాయక్‌కు కూడా నటన కొత్తేమీకాదు. ‘ఠాగూర్’లో ఆయన చేసిన చిన్న పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంది. ఆయనలో మంచి నటుడు ఉన్నాడని ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెబుతుంటారు. మొత్తానికి ప్రస్తుతం దర్శకుడిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినాయక్.. నటుడిగా రాణిస్తారోమో చూడాలి. కిందటేడాది వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ఇంటెలిజెంట్‌’ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆ తరవాత మరో సినిమాను వినాయక్ పట్టాలెక్కించలేకపోయారు. 

Related Posts