గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా రెండు దశాబ్దాల పాటు ఎంతో నిబద్ధతతో పని చేశానని మోదీ తెలిపారు. ఏ అవినీతి కుంభకోణంలోనైనా తన పాత్ర ఉందని నిరూపించాలని విపక్షాలకు సవాల్ విసిరారు. యూపీలోని బల్లియాలో నిర్వహించిన ఓ సభలో ప్రసంగిస్తూ... మహాకూటమి నేతలకు ఇదే తన సవాల్ అని అన్నారు. తనకు అక్రమ ఆస్తులు కానీ, ఫాంహౌస్ లు కానీ, షాపింగ్ కాంప్లెక్సులు కానీ, విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముగానీ ఉంటే చూపించాలని సవాల్ విసురుతున్నానని చెప్పారు. కోట్ల విలువ చేసే విదేశీ కార్లు, ఖరీదైన బంగ్లాలు ఉంటే నిరూపించాలని అన్నారు.పేదల సొమ్మును లూటీ చేయాలని కానీ, ధనవంతుడిని కావాలని కానీ తాను ఏనాడూ కలలు కనలేదని మోదీ చెప్పారు. వ్యక్తిగత జీవితం కంటే తనక పేదల సంక్షేమం, మాతృభూమి రక్షణే ముఖ్యమని తెలిపారు. తనపై విక్షాలు చేస్తున్న విమర్శలను గిఫ్ట్ గానే భావిస్తానని చెప్పారు.