YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

నేతికొండ మాటున వడక్కునాధర్

 నేతికొండ మాటున వడక్కునాధర్

యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:   

కేరళలోని వడక్కునాధేశ్వరుని ఆలయం , కేరళ భూమి ఆవిర్భావం ఒకేసారి జరిగాయని  అక్కడి ప్రజలు భావిస్తారు . అంత ప్రాచీనమైన ఆలయం.
శ్రీ వడక్కు నాధేశ్వరుని ఆలయం దశావతారాలలో ఆరవ అవతారమైన పరశురామునిచే నిర్మించబడినదని  పురాణాలు వివరిస్తున్నాయి.

జమదగ్ని కుమారుడైన పరశురాముడు తమ ఆశ్రమం నుండి బలవంతంగా కామధేనువును అపహరించి ఋషిపట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు  కార్తవవీర్యార్జునుడనే చక్రవర్తిని యుధ్ధంచేసి హతమారుస్తాడు.  పరశురాముడు లేని సమయాన ఆ రాజు కుమారులు  ప్రతీకారంగా జమదగ్ని తలను నరికి శరీరాన్ని ఇరవైయొక్క ముక్కలుగా చేస్తారు. విషయం తెలుసుకొని క్రోధావేశంతో భార్గవరాముడు తన పరశుతో కార్తవవీర్యార్జునుడి కుమారులను హతమార్చి , ఆగ్రహావేశం చల్లారక ,అధికార మదంతో అహంకార పూరితులైన  క్షత్రియజాతినే సమూలంగా నిర్మూలించాలని రాజులందరిమీద 21 సార్లు దండయాత్ర సాగించాడు.

లోకక్షేమం కోరి
మునులంతా
శాంతం వహించమని  పరశురాముని కోరుతారు.
వారి కోరికను మన్నించి, రక్తసిక్తమైన తన గండ్రగొడ్డలిని సముద్రంలో కి  బలంగా విసిరివేశాడు పరశురాముడు. గండ్రగొడ్డలి ఎగిరిపడినంతమేర ఒక గొప్పభూభాగం ఏర్పడింది.

గోకర్ణమునుండి , దక్షిణ
కేరళదాకా ఏర్పడిన  ఆ భూమినే  'పరశురామ క్షేత్రంగా'  నేడు పిలువ బడుతోంది.

తరువాత పరశురాముడు హిమాలయాలలో  తపస్సు చేసి,శివుని ప్రత్యక్షం చేసుకొన్నాడు. పరశురాముడు తను ఏర్పరిచిన క్షేత్రం లో నివసించ మని  పరమ శివుని వరం కోరాడు.

పరశురాముని కోరిక నెరవేర్చడానికి  శివుడు
నందీశ్వరుని , సింహోదరుణ్ణి , పరశురామ క్షేత్రానికి వెళ్ళి
తాను నివసించడానికి
తగిన ప్రదేశం చూసి రమ్మని పంపాడు.

అలాగ , ఆ శివగణం ఎంపిక చేసి నిర్ణయించిన ప్రదేశమే నేటి కేరళలోని 'త్రిస్సూర్' .
ఆదికాలంలో, తిరుశివపురం,
శివపేరూరు అని పిలువబడిన ఆ ప్రాంతం బ్రిటిష్ వారి హయాంలో
'త్రిచూ ర్' గా మారింది.

పరశురాముని వరం తీర్చడానికి  పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య  సహితంగా,
తన పరివారంతో ఈశ్వరుడు ,
పరశురాముని వెంట
బయలుదేరాడు.
త్రిషూర్ ప్రాంతానికి రాగానే అక్కడే  నివసించాలనే కోరిక
కలిగిన శివుడు ఒక ప్రదేశం లో అంతర్ధానమై అక్కడ వున్న ఒక పెద్దమర్రి చెట్టు
క్రింద  అఖండజ్యోతి స్వరూపమైన
శివలింగముగా మారడం  చూసిన పరశురాముడు హతశుడైనాడు.

ఆ ప్రదేశమే ఇప్పుడు
'శ్రీ మూలస్ధానం'  అని
పిలువబడుతోంది.

పరశురాముడు
ఆ ప్రదేశం లోనే  పరమేశ్వరుని,పార్వతీదేవి ని
ప్రతిష్టించడమే కాకుండా
శ్రీ రాముని విగ్రహాన్ని  కూడా
ప్రతిష్టించాడు.

తరువాత కొంతకాలానికి
'కొచ్చి' ని పాలించిన మహా రాజు విగ్రహాలను ఇప్పుడు
ఆలయం వున్న ప్రదేశం లో
మరల ప్రతిష్ట చేశాడు.

తొమ్మిది ఎకరాల సుక్షేత్రంలో
బ్రహ్మాండమైన ఆలయం
నిర్మించాడు.
ఆలయంలో  మూల విరాట్
ఈశ్వరుడు. ఆలయంలో
శ్రీ పార్వతి, శ్రీ గణపతి,
శ్రీ కృష్ణుడు,  శ్రీ రాముడు,
శ్రీ శంకరనారాయణుడు మొ.
దేవతా విగ్రహాలు ప్రతిష్టింప బడినవి.

ఈ ప్రాకారంలో, శ్రీ శాస్తా,శ్రీ రిషభర్,శ్రీ సింహేంద్రుల
విగ్రహాలు ప్రతిష్టింప బడి
భక్తులచే పూజింపబడుతున్నారు.

గర్భగుడి లో భారీ శివలింగ రూపంలో వడక్కునాధేశ్వరుడు
అనుగ్రహం ప్రసాదిస్తున్నాడు.

నిజానికి అసలు లింగరూపం భక్తులకు కనిపించదు. శతాబ్దాలకాలంగా స్వామిని  అభిషేకించిన నెయ్యి
అలాగే వదలి వేసారు.
ఆ నెయ్యి పెద్ద కొండలా
పేరుకు పోయి
పదహారు అడుగుల ఎత్తున  భక్తులకు దర్శనమిస్తుంది.

కైలాస గిరి పరమేశ్వరుడే
నెక్కొండ(నేతికొండ) వడక్కునాధేశ్వరుని గా
భక్తులకు దర్శనం
ప్రసాదిస్తున్నాడు.

ఈ వడకునాధేశ్వరుని మహిమ కారణంగా , వాతావరణం లోని వేడికిగాని ,
ప్రక్కనే వెలిగే దీపాల వేడికి గాని అభిషేకించిన
నెయ్యి కరిగి పోదు. ఆ నేతి పరిమళంలో ఎటువంటి చెడు
వాసనరాదు. సర్వకాల సర్వావస్థలలో ఆ నేతికొండలోనుండే శివుడు తన  భక్తులను కాపాడుతాడని ప్రజల ప్రగాఢ విశ్వాసం.

Related Posts