YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కిశోర్ చంద్రదేవ్ కులంపై కొనసాగుతున్న రగడ

కిశోర్ చంద్రదేవ్ కులంపై కొనసాగుతున్న రగడ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆయన వయసు డెబ్బై మూడు. ఆయన రాజకీయ వయసు నలభయ్యేళ్ళకు పైబడినదే. ఎన్నో సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన కిశోర్ చంద్రదేవ్ గిరిజనుడు కాడా. ఆయన ఎస్టీ సీటు నుంచేఅన్ని సార్లు పోటీ చేసి గెలిచింది. మరి ఆయన గిరిజనేతరుడు అంటోంది జనసేన. ఆ పార్టీ తరఫున అరకు ఎంపీగా పోటీ చేసిన వంపూర్తి గంగులయ్య కేంద్ర మాజీ మంత్రి కులం మీదనే నేరుగా బాణం వేశారు. బినామీ గిరిజనులుగా చెలామణీ అవుతున్న గిరిజనేతరుల కుట్ర నుంచి నిజమైన గిరిజనులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. కొండదొర కులం పేరుతో గిరిజనుడిగా చెలామణీ అవుతూ రాజ్యాంగ పదవులను అనుభవిస్తున్న కురుపాం రాజు కిశోర్‌చంద్రదేవ్‌ వంటివారిని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు. మరి ఇదే నిజమైతే ఇన్నాళ్ళు ఆయన్ని గిరిజనులు ఎందుకు గెలిపించినట్లు.గిరిజనుల్లో సీనియర్ నేతగా ఉన్న కిశోర్ చంద్రదేవ్ కులం విషయంలో వివాదం రేగడం గతంలో ఎన్నడూ లేదు. అయితే విజయనగరం జిల్లాలోని గిరిజన కుటుంబాల్లో చాలా మంది విషయంలో మాత్రం కుల రాధ్ధాంతం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అంతెందుకు తాజా ఎన్నికల్లో కురుపాం ఎస్టీ అసెంబ్లీ సీటు నుంచి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన జనార్ధన్ థాట్రాజ్ ఎస్టీ కాదని అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించారు. అంతకు ముందు పలు దఫాలు ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రిగా కూడా పనిచేసిన శత్రుచర్ల విజయరామ రాజు ఎస్టీ కాదని ఆ మధ్యన హైకోర్ట్ 
తీర్పు చెప్పింది. మరి ఇదే ప్రాంతానికి చెందిన సంస్థానాధీశుడు వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఎస్టీ కాదని ఇంతవరకూ ఎవరూ పేర్కొనలేదు. అయితే వారిది రాజ వంశం అని అందరికీ తెలుసు. కొండ రాజులని పేరు. అటువంటిది గిరిజనుడు ఆయన కానే కాదు అని జనసేన అరకు ఎంపీ అభ్యర్ధి అనడం నిజంగా అతి పెద్ద వివాదానికి దారి తీసే అంశమే.ఇదిలా ఉంటే కిశోర్ చంద్రదేవ్ మీద గిరిజనులతో కలసిపోరని, ఆయనది రాజ వంశమని, ఓట్ల కోసం అయిదేళ్ళకు ఒకసారి మాత్రమే వస్తారని విమర్శలు ఉన్నాయి. అదే విధంగా ఆయన జీవ విధానం కూడా గిరిజనులకు భిన్నంగా ఉంటుందని అంటారు. అయితే ఆయన పూర్వీకులు నాగరిక ప్రపంచలోకి వచ్చి చాలా కాలమైంది కాబట్టి వారి వంశస్థులు పద్ధతులు వేరుగా ఉంటాయని చెబుతున్నారు. ఏది ఏమైనా అసలైన గిరిజనుల కోసమే పనిచేస్తామని, బినామీల భరతం పడతామని జనసేన అభ్యర్ధి అనడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. ఈసారి పోటీ చేసిన అభ్యర్ధులను తీసుకుంటే వైసీపీ అభ్యర్ధిని గొడ్డేటి మాధవి సైతం అచ్చమైన గిరిజన నాయకురాలే. స్థానికంగా వారి తోనే ఉంటూ అక్కడి సమస్యలపైనే పోరాడుతారన్న పేరు ఉంది. మరి కిశోర్ మాత్రం ఎవరికీ అందుబాటులో ఉండరన్న ఆరోపణలైతే ఉన్నాయి. రాజకీయ జీవిత చరమాకంకంలో ఆయన కులం మీద వివాదం రావడం మాత్రం ఆసక్తికరమైన అంశమే.

Related Posts