YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ ఏడాది మిగిలిపోనున్న ఇంజనీరింగ్ సీట్లు

ఈ ఏడాది మిగిలిపోనున్న ఇంజనీరింగ్  సీట్లు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం వెంపర్లాడుతున్నాయి. అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ సీట్ల కంటే ఈ సంవత్సరం ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య తక్కువ కావడంతో చాలా వరకు సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని 17 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, 305 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు త్వరలో కౌనె్సలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో 3924సీట్లు, 305ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో లక్షా 53వేల 150సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి లక్షా 70వేల 128మంది విద్యార్ధులు హాజరుకాగా లక్షా 23వేల 974మంది విద్యార్ధులు అర్హత సాధించారు. అదే విధంగా తెలంగాణా రాష్ట్రం నుండి 17వేల 356మంది విద్యార్ధులు పరీక్షకు హాజరుకాగా 15వేల 216మంది విద్యార్థులు అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం లక్షా 87వేల 484మంది విద్యార్ధులు ఎంసెట్‌కు హాజరుకాగా లక్షా 49వేల 
505మంది విద్యార్ధులు అర్హత సాధించారు. మొత్తం 79.74శాతం మంది విద్యార్ధులు ఎంసెట్‌లో అర్హత పొందారు. ఇందులో బాలురు 81వేల 734మంది అర్హత సాధించగా, బాలికలు 57వేల 451మంది అర్హత సాధించారు. ట్రాన్స్‌జెండర్స్ ఐదుగురు కూడా అర్హత సాధించారు. మొత్తంమీద రాష్ట్రంలో లక్షా 53వేల 150కి పైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే లక్షా 49వేల 505 మంది విద్యార్థులు మాత్రమే అర్హత సాధించడంతో ఉన్న సీట్ల కంటే అర్హత సాధించిన వారి సంఖ్య తక్కువగా ఉంది. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు లభించిన వారికి ఆనందమే అయినప్పటికీ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఈ దఫా విద్యార్థుల కోసం వెతుకులాడే పరిస్థితి ఏర్పడింది. ‘సీటు ఇస్తాం మహాప్రభో, రండి రండి వచ్చి మా కళాశాలలో చేరండి’ అని బతిమలాడే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు గతంలో ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చాయి. మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం ఆయా 
ప్రభుత్వాలు తగిన సంఖ్యలో రాష్ట్రానికి మంజూరుచేయకపోవడంతో మెడిసిన్ సీట్లకు ఎప్పటిలాగే ఈ సంవత్సరం భారీ డిమాండ్ ఏర్పడింది. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులను ఈ సంవత్సరం నుండి ఎంసెట్ ద్వారా ఎంపిక కాకుండా, నీట్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఎంసెట్‌కు హాజరైన విద్యార్ధులకు ర్యాంక్ కార్డులను జారీచేస్తున్నారు. 

Related Posts