యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇప్పటి వరకు పెరగడమే కాని తగ్గడం తెలియని వినియోగదారులుకు గుడ్ న్యూస్ సోలార్ ఎనర్జీతో కరెంట్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో చేపట్టిన అనంతరం చార్జీలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇంతకాలం ప్రతి రెండేళ్లకు ఒకసారి విద్యుత్ చార్జీల పెంపుతో విసిగిపోయిన ప్రజలకు రానున్న రెండేళ్లలో ఉపశమనం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కర్నూలు సమీపంలో నిర్మాణంలో ఉన్న అతి పెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు పూర్తయి సౌరశక్తి అందుబాటులోకి వస్తే ప్రభుత్వ ఆలోచన ఒక రూపు దాలుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. కర్నూలులో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం కాగా రానున్న రెండేళ్లలో అనంతపురం, కడప జిల్లాల్లో నెలకొల్పే సౌర విద్యుత్ కేంద్రాల ద్వారా మరో నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. కర్నూలులో పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో మూడునెలల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు అంటున్నారు. సౌర
విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఇతర విద్యుత్ ఉత్పత్తి రంగాల కన్నా అతి తక్కువగా ఉండడంతో చార్జీలు తగ్గించే అవకాశాలున్నాయి. కర్నూలులో సౌరశక్తి అందుబాటులోకి వస్తే చార్జీలపై ప్రభుత్వానికి ఒక అవగాహన వస్తుందని, ఆ తరువాత అనంతపురం, కడప జిల్లాల్లో సౌరశక్తి కేంద్రాల నిర్మాణం పూర్తయ్యాక విద్యుత్ చార్జీల తగ్గింపుపై ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చేసి 2018 డిసెంబర్ నాటికి విద్యుత్ చార్జీలు తగ్గించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు. సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తే ఆ విద్యుత్‌ను గృహ వినియోగానికి అధికంగా కేటాయించి ఇతర రంగాల నుంచి వచ్చే విద్యుత్‌ను పారిశ్రామిక రంగాలకు కేటాయించడం ద్వారా గృహ వినియోగ విద్యుత్ చార్జీల ప్రభావం ప్రజలపై తగ్గిస్తారని భావిస్తున్నారు. ఇక జల విద్యుత్ ఉత్పత్తిని సైతం తగ్గించి శ్రీశైలం నుంచి రాయలసీమ, నాగార్జునసాగర్ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు ఇప్పుడున్న అందిస్తున్న దాని కంటే ఎక్కువగా అందించే అవకాశముందని వారంటున్నారు. దీంతో ప్రజల్లో చంద్రబాబుపై విశ్వాసం పెరిగి మరో మారు అధికారాన్ని అందిస్తారని టిడిపికి చెందిన మేథావులు సైతం సలహా ఇచ్చారని వారు
పేర్కొంటున్నారు. మొత్తం మీద సౌరశక్తి ఇటు ప్రజలపై భారాన్ని తగ్గించడమేగాక, అటు చంద్రబాబును అధికారానికి దూరం కాకుండా చూస్తుందని వారు అంచనా వేస్తున్నారు.