ఐదారు దశాబ్దాల క్రితం సనాతన కుటుంబాలలో మడి ఆచారాలకు ఏమాత్రం కొరత వచ్చినా ‘సర్వం జగన్నాథం అయిపోయింది’ అని సణిగేవారు. అయితే అప్పటికి చాలామందికి జగన్నాథం అంటే ఏమిటో తెలియదు. నేడు పూరీ (ఒరిస్సా) లోని జగన్నాథ స్వామి ఆలయంలో కులమతబేదాలు లేకుండా దర్శనాలు, ప్రసాదాలు లభిస్తున్నాయి. భక్తులకు భోజనం లభిస్తున్నది. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు ఒక్కటే. అగ్రవర్ణాలు, నిమ్నకులాలు అనే ప్రసక్తి రాదు. అందుకే సర్వం జగన్నాథం అనేవారేమో !
పూరీలో శైవులు, శక్తిఆరాధకులు, వైష్ణవులు, జైనులు, బుద్ధులు జగన్నాథ తత్వానికి లోబడి ఉంటారని ప్రతీతి. దీనినే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. సర్వమత సమ్మేళానికి పూరీ నిదర్శనమని పేర్కొంటారు. జగన్నాథ తత్వం అంటే సర్వమానవ సౌభ్రాత్రం కలిగి ఉండడం, ప్రేమ, కుల,మతసహనమం, ఆచార, సంప్రదాయాలు, ఇతర, మతాలు, వాటిలోని విభాగాలను గౌరవించడం అని పేర్కొంటారు
ప్రపంచ స్థాయి వంటశాల
పూరీ జగన్నాథస్వామి ఆలయంలో ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న వంటశాల ప్రపంచంలో పెద్దది కావడం మనకు, మనదేశానికి గర్వకారణం. పూరీ ఆలయం వంటిల్లు 150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో కూడి ఉన్నది. ఈ స్థాయి వంటశాల ప్రపంచంలో మరెక్కడాలేదనే అంశం నిర్వివాదాంశం. పూరీ ఆలయ వంటశాలలో 32 గదులు ఉన్నాయి. వాటిలో 250 మట్టి పొయ్యిలు పనిచేస్తునాయి. సుమారు 600 మంది వంటవారు, 400 మంది సహాయకులు పనిచేస్తూ వేలాది మందికి వంటలు సమకూర్చుతున్నారు. ఈ వంటశాలను శ్రీమందిర్ అని పిలుస్తారు. ఇక్కడ వివిధ రకాల ఛూలీలు (వంటపొయ్యి) ఉన్నాయి. వంటింటి నిప్పును (అగ్ని) వైష్ణవ అగ్ని అని పిలుస్తారు. ఈ అగ్ని విష్ణువుకు వంటలు కల్పించేదని ఐతిహ్యం. వైష్ణవ అగ్ని ఎప్పుడూ శాంతం కాదు. రేయింబవళ్లు మండుతూనే ఉంటుంది
పూరీ ఆలయ విశిష్టత
ఎందరో భక్తులు పూరీకి వెళ్లి జగన్నాథుని సందర్శించి వస్తుంటారు. కాని వారిలో చాలామందికి ఆలయ ప్రత్యేకత, విశిష్టత తెలియవు. ఆలయ ఉపరితలంలోని సుదర్శన చక్రం ఏ వైపు నుండి చూసినా చూపరుల వైపే ఉంటుంది. ఇది ఒక విచిత్రం. పూరీ ఆలయం పై విమానాలు వెళ్ళవు. చివరకు పక్షులు కూడా ఎగరవు.
ఎండ కాచినప్పుడు భూమిపై వస్తువుల నీడ కనిపిస్తుంది. ఇది ఒక సహజమైన విషయం. కాని, పూరీ ఆలయ ప్రధాన శిఖరం నీడ ఎక్కడా పడదు. రోజులో ఏ సమయంలో కూడా నీడ కనపడదని రుజువయింది.
ఇక వంటింట్లో మరో విచిత్రం. పొయ్యిపై ఏడు పాత్రలు ఒకటి పై మరొకదానిని ఉంచి అన్నం వండుతారు. ఇక్కడ విశేషం ఏమిటంటే మొదట చివరి (ఏడవ) పాత్రలోని బియ్యం ఉడుకుతుంది. అట్టడగు పాత్రలోని బియ్యం చివరన అన్నమవుతుంది.
రోజూ వంటకు ఒకే మోతాదులో వంట దినుసులు ఉపయోగిస్తారు. ఈ మోతాదులో వండిన వంటకాలు ఎంతమంది వచ్చినా సరిపోతాయి. కొన్ని వేలమంది కానీ కొన్ని లక్షల మంది కానీ అదే వంట అందరికీ సరిపడుతుంది,
సింహద్వారం దాటి వెలుపలకు వెడితే సముద్రం హోరు వినిపిస్తుంది.అదే ఒక అడుగు ముందుకు వేసి ఆలయం లోపలికి వెడితే ఆ శబ్దం వినిపించదు. ఆలయ పతాకం ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంటుంది.
ఇన్ని ప్రత్యేకతలు, విశిష్టతలకు నిలయమైన పూరీ జగన్నాథస్వామి ఆలయాన్ని, అక్కడ వెలసిన కృష్ణ, బలరాములను, సుభద్రను దర్శించడం మరచిపోకండి.