యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
టాలీవుడ్‌లో సంచలనం కలిగించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. సుమారు రెండేళ్లుగా దర్యాప్తు అనంతరం ఈ కేసులో నాలుగు చార్జిషీట్లను దాఖలు చేసింది సిట్. కేసు దర్యాప్తులో భాగంగా మొత్తం 62 మంది నటీ, నటులు, దర్శకులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులను విచారించినట్లు వెల్లడించారు. అయితే ఈ కేసులో విచారణకు హాజరయిన సినీ తారలు ఇతర ప్రముఖుల పేర్లు చార్జిషీటులో లేకపోవడం గమనార్హం. టాలీవుడ్‌ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో రవితేజ, పూరీ జగన్నాథ్, చార్మి, తరుణ్, నవదీప్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, శ్యామ్ కె నాయుడు, నందు, చిన్నా, శ్రీనివాస్ (రవితేజ కారుడ్రైవర్) ఇలా.. 12 మంది ప్రముఖులను విచారించి వారి నుండి నమూనాలను సేకరించారు. అయితే వీరిలో ఏ ఒక్కర్నీ చార్జ్ షీట్‌లో చేర్చకుండా క్లీన్ చీట్ ఇచ్చింది సిట్. డ్రగ్స్ కేసులో అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని.. రెండేళ్ల కిందటి డ్రగ్స్ కేసు విచారణ ఎంత వరకూ వచ్చిందో చెప్పాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచార హక్కు చట్టం ద్వారా
పద్మనాభరెడ్డి అనే సామాజిక కార్యకర్త అర్జీ పెట్టడంతో.. డ్రగ్స్ కేసు గుట్టు వెలుగులోకి వచ్చింది.