యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రజలు గుండెల్లో గుడికట్టుకుని పూజిస్తున్న మహనీయుడు సర్ ఆర్దర్ కాటన్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. నీటి విలువ, గొప్పదనం తెలిసిన సర్ ఆర్దర్ కాటన్ మహాశయుడని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే నీరు-ప్రగతి లాంటి జలసంరక్షణ ఉద్యమాలు ప్రారంభించామని అన్నారు. బుధవారం నాడు అపర భగీరథుడు కాటన్ జయంతి సందర్భాన ఆయనకు చంద్రబాబు నివాళులర్పించారు. తరచూ కరవు కాటకాలకు, వరద ముంపునకు గురైన ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా తీర్చిదిద్దిన కాటన్. ధవళేశ్వరం దగ్గర గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి చరితార్ధుడైన కాటన్ అని అయన అన్నారు.
కాటనాయనమ: అని వేదమంత్రాలలో సైతం కాటన్ పేరును స్మరించుకునే గోదావరి జిల్లాలు. కాటన్ స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నామని అన్నారు. దశాబ్దాలుగా కలగానే మిగిలిన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 70% పూర్తిచేశాం. జూలై నుంచి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు విడుదల అవుతుందని అన్నారు. పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ దశ,దిశ మారిపోతుంది. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం కలనిజం చేశాం. కృష్ణా డెల్టా లో కరవు చాయల్ని తరిమికొట్టామని ముఖ్యమంత్రి అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల కృష్ణా డెల్టా లో రూ.44 వేల కోట్ల విలువైన పంట దిగుబడి వచ్చింది. ఐదేళ్ల పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో 23 జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. పోలవరం
పూర్తయితే ఏపీ దశ, దిశ మారుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.